● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఈనెల 24వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఈనెల 24 నాటికి పూర్తి చేయాలన్నారు. ఈనెల 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని, అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలను విచారించి పరిష్కరించే ప్రక్రియ చేపట్టి, అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా ప్రచురించబడుతుందన్నారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించి సవరించిన షెడ్యూల్‌ను సంబంధిత ఎన్నికల అధికారులు, బీఎల్‌ఓలు, ఎన్నికల సిబ్బంది తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రజలకు ఈ షెడ్యూల్‌పై పూర్తి అవగాహన కల్పించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రచార మాధ్యమాలను వినియోగించి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సవరించిన షెడ్యూల్‌ను లిఖితపూర్వకంగా తెలియజేసి, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.


