● ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడు
కర్నూలు: ఆస్తి కోసం కొడుకు, కోడలు వేధింపులకు గురిచేస్తున్నారని ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కల్లూరుకు చెందిన నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా ఆయన వేడుకున్నారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నింటిపై చట్ట పరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, ఇస్మాయిల్, మస్తాన్ వలి తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
పీజీఆర్‌ఎస్‌లో మరికొన్ని ఫిర్యాదులు...
● తన కుమారుడు షణ్ముఖ మృతిపై అనుమానం ఉందని, సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలంటూ ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.
● కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పెరుమాళ్ల విజయ్ అనే వ్యక్తి రూ.34 వేలు తీసుకుని మోసం చేశాడని కృష్ణగిరి మండలం పుట్లూరు గ్రామానికి చెందిన హుసేన్ ఫిర్యాదు చేశారు.
● కల్లూరుకు చెందిన నాయకంటి మహేశ్వరి ఉద్యోగాల పేరుతో తన తమ్ముళ్లు, మామ, అత్తల నుంచి రూ.60 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన పార్వతమ్మ ఫిర్యాదు చేశారు.
● తండ్రి ఉద్యోగం తనకు రాకుండా తమ్ముడు ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్ సృష్టించి ఉద్యోగం తనకు రాకుండా మోసం చేశాడని కర్నూలు ఎర్రబురుజుకు చెందిన అరుణ జ్యోతయ్య ఫిర్యాదు చేశారు.
● సెలూన్, బ్యూటీపార్లర్, టాటూ స్టూడియోలకు ఫ్రాంచైజీ ఇస్తామని నమ్మించి అగ్రిమెంట్ చేసుకుని, మెటీరియల్ పేరుతో రూ.60 లక్షలు తీసుకుని హైదరాబాదుకు చెందిన మార్కెటింగ్ మేనేజర్ బృహస్పతి రావు, నరసరావుపేటకు చెందిన అష్రఫ్ వలి మోసం చేశారని కర్నూలుకు చెందిన చకిత ఫిర్యాదు చేశారు.


