● కుమార్తెలు, అల్లుడితో కలిసి
దాడిచేసి హత్య
పత్తికొండ రూరల్: కుటుంబ కలహాల కారణంగా భర్తను తన కుమార్తెలు, అల్లుడితో కలిసి భార్య కడతేర్చారు. ఈ ఘటన సోమవారం హోసూరు గ్రామంలో వెలుగుచూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పత్తికొండ మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్(51)కు భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు నీలావతి, సుజాత, అల్లుడు రాజశేఖర్ ఉన్నారు. కుటుంబ విభేదాలతో భార్యాభర్తలు వేర్వేరు ఇళ్లలో నివశిస్తున్నారు. సునీతతో కలిసి కుమార్తెలు ఉంటున్నారు. శ్రీనివాస్ తన సొంతింట్లో ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య ఆస్తి పంపకాలు, గొడవలకు సంబంధించి వివాదం ముదిరిపోయింది. దీంతో భార్య సునీత, కుమార్తె, అల్లుడి సాయంతో హత్యకు పథకం వేశారు. రాత్రి సమయంలో మేకల శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. రాడ్లు, కట్టెలు, కర్రలతో దాడి చేసి చంపేశారు. కాళ్లు, చేతులు విరిగి రక్తస్రావమై మేకల శ్రీనివాస్ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు సోమవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న వెంటనే డీఎస్పీ వెంకట్రామయ్య, సీఐ జయన్న గ్రామానికి చేరుకుని హత్యపై విచారణ చేపట్టారు. నలుగురిపైన హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ జయన్న తెలిపారు.


