● ఇతర జిల్లాల్లో అమలు..
కర్నూలులో నిరీక్షణ
కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎన్‌ఎంఎంలకు పదోన్నతుల ప్రక్రియ ఇతర జిల్లాల్లో కొనసాగుతున్నా కర్నూలు జిల్లాలో చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో హెల్త్ కార్యదర్శులు(ఏఎన్‌ఎం)లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారు. అయితే పదోన్నతుల విషయంలో మాత్రం వీరికి అన్యాయం జరుగుతోంది. జిల్లాలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 1,008 మందికి హెల్త్ కార్యదర్శులుగా ఉద్యోగాలు కల్పించారు. వీరి సీనియారిటీ మేరకు గత సంవత్సరం 175 మందికి పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం 833 మంది సచివాలయ ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించాలని వారు కోరుతున్నారు.
జిల్లాలో అమలుకాని ఉత్తర్వులు
రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాత అనేక జిల్లాల్లో అర్హులైన హెల్త్ కార్యదర్శులు(ఏఎన్‌ఎం)లకు పదోన్నతులు కల్పించారు. కానీ కర్నూలు జిల్లాలో మాత్రం ఫైళ్లు ముందుకు సాగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల్లో తమతో పాటు పనిచేసిన సహొద్యోగులు పదోన్నతులు పొంది కొత్త బాధ్యతలు స్వీకరిస్తుంటే తాము మాత్రం అదే స్థాయిలో కొనసాగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు విన్నవించినా
ఫలితం శూన్యం
ఈ అంశంపై ఇప్పటికే ఏఎన్‌ఎంలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పదోన్నతుల ప్రక్రియ ఎందుకు నిలిచిపోయిందని ఆ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఆ శాఖలోని కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 14తో అన్ని రకాల పదోన్నతులు ఫ్రీజ్ అవుతున్నాయని, ఏఎన్‌ఎంల పదోన్నతుల ప్రక్రియకు గడువు పొడిగించి పూర్తి చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తమ ఆవేదన వినిపిస్తున్నారు.
ఇతర జిల్లాల్లో ఏఎన్‌ఎంల పదోన్నతుల ప్రక్రియ చేస్తున్నారని, ఇక్కడ కూడా చేయాలంటే కుదరదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి గైడ్‌లైన్స్ రాలేదు. సచివాలయ ఏఎన్‌ఎంలకు నవంబర్, డిసెంబర్‌లలో పదోన్నతుల ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు కాదు, ఇప్పుడే చేయాలంటే ఎలా?. –డాక్టర్ ఎల్.భాస్కర్,
ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ, కర్నూలు


