ఎల్‌నినో అనేది కొత్తది కాకున్నా ఈ సారి శక్తివంతమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రుతుపవనాలకు జీవనాడిగా భావించే సోమాలియా జెట్, మెడెన్– జూలియన్ అస్సిలేషన్ (ఎంజేవో) కూడా ప్రతికూలంగా ఉండటంతో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దక్షిణ హిందూ మహా సముద్రం నుంచి భూమధ్యరేఖను దాటి సోమాలియా తీరప్రాంతం వెంట అరేబియా సముద్రం మీదుగా భారతదేశం వైపు వీచే బలమైన తక్కువ ఎత్తు గాలుల ప్రవాహాన్ని జెట్‌గా పిలుస్తారు. అరేబియా సముద్రం నుంచి భారీగా తేమను భారత దేశానికి తీసుకరావడం వల్ల నైరుతి రుతుపవనాల ప్రభావం చూపిస్తాయి. సోమాలి యా జెట్ బలంగా ఉంటే సాధారణం మించి వర్షపాతం నమోదవుతుందని వాతావావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సోమాలియా జెట్ బలహీనంగా మారడంతో నైరుతి మందగించినట్లు అంచనా వేస్తున్నారు. ఎంజేవో అనేది హిందూ మహా సముద్రంలో 30 నుంచి 60 రోజుల వ్యవధిలో తూర్పుకు కదిలే విశాలస్థాయి మేఘాలు, వర్షాపాతం, గాలుల డోలనం వల్ల మంచి వర్షాలు కురిసే ఆస్కారం ఉంది. ఎంజేవో అనేది కనిపించని వాతావరణ తరంగం లాంటిదని , తూర్పుకు చురుగ్గా కదిలితే రుతుపవనాల శక్తిని పెంచుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎంజేవో భారత్‌కు దగ్గరగా ఉన్నప్పుడు రుతుపవనాలు ప్రభావం చూపిస్తాయని, ప్రస్తుత తరుణంలో ఎంజేవో భారత్‌కు దూరంగా ఉన్నందున నైరుతి బలహీన పడే అవకాశం కన్పిస్తోందని అంచనా వేస్తున్నారు.


