శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకులు జరిపించారు. స్వర్ణరథంలో కొలువైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30 గంటలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యురాలు జి.లక్ష్మీదేవి, ఆలయ ఏఈవో జి.స్వాములు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారు లు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


