మారని చేనే‘తల రాత’ | - | Sakshi
Sakshi News home page

మారని చేనే‘తల రాత’

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): నష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవడం లేదు. ఘన కీర్తిని సొంత చేసుకున్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కో పరం చేయడానికి చర్యలు చేపట్టింది. దీంతో తమ తల రాతలు మారబోవని చేనేత కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఏర్పాటు అయ్యింది. ఈ సంఘాన్ని మురార్జీదేశాయ్‌ స్వయంగా వచ్చి పరిశీలించారు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం వ్యవస్థాపకుడు మాచాని సోమప్ప నాటి జవహర్‌లాల్‌ నెహ్రూతో గుంతకల్లులో సమావేశమై చేనేత వస్త్రాల ఉత్పత్తి, విశిష్టతను వివరించారు. ఈ సొసైటీకి ఇంటర్నేషనల్‌ అవార్డుతో పాటు పలు నగదు పురస్కారాలు కూడా దక్కాయి. ఎంతో ఘనకీర్తిని గడించిన ఎమ్మిగనూరు చేనేత సహకర సంఘం ఒకప్పుడు 2000 మంది సభ్యు లతో ఏటా కోట్ల రూపాయల టర్నోవర్‌తో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం రూ. 6 కోట్లు నష్టాల్లో ఉంది.

ఆర్థిక వెసులుబాటు ఇవ్వకుండా..

నష్టాల్లో ఉన్న సంఘాన్ని గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. మొదటి దశలో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం షో రూముల్లో ఆప్కో ఉత్పత్తులు ఉంచి విక్రయించాలని నిర్ణయించింది. ఆ తర్వాత సంఘాన్ని ఆప్కో పరం చేసే కుట్రదాగి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండేళ్లలో ఆప్కో తమ షోరూములకు కొత్త సరుకు అనేదే పంపిన దాఖలాలు లేవు. లేని అప్కో ఉత్పత్తులను ఎమ్మిగనూరు సంఘం షోరూముల్లో ఉంచి విక్రయిస్తారనేది సమాధానం లేని ప్రశ్న. నష్టాల్లో ఉన్న సంఘానికి ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు మాత్రం లేవు.

ఆధిపత్య పోరు

సంఘంలో 59 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి జీతభత్యాలకే రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. విద్యుత్‌ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపితే సంఘానికి నష్టాలే మిగులుతున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న 59 మందిలో 18 మంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నారు. పాలకవర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం రిటైర్డ్‌ అయిన వారిని కూడా కొనసాగిస్తుండటంతో సంఘంపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రిటైర్డ్‌ అయిన వా రిని కొనసాగించడం అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పాలక వర్గాలు, సంఘం సెక్రటరీల మధ్య ఆధిపత్య పోరు కూడా సంఘం నష్టాల్లో కూరుకుపోవడానికి కారణమవుతోందనే విమర్శలు ఉన్నాయి.

తగ్గిపోయిన ఉత్పత్తులు

ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు 2000 మంది సభ్యులతో కళకళలాడిన సంఘంలో నేడు 500 మంది కూడా సభ్యులు లేరు. ఇందులో కూడా చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నది 200 మంది వరకే. ఇందువల్ల ఉత్పత్తులు పడిపోయాయి. ఆధునిక యుగంలో కొత్త కొత్త డిజైన్‌లతో రాణించాల్సి ఉండగా... నేటికి సంప్రదాయ వస్త్రాలైన దోవతులు, పంచలు, టువాళ్లు, దోమతెరలకే పరిమితం అయ్యింది. నాగరికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో సంప్రదాయ వస్త్రాలకు ఆదరణ తగ్గిపోయింది.

వైఎస్సార్‌సీపీ హయాంలో ఇలా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేనేతను ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసింది. ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆధునాతన పరికరాలను సరఫరా చేసింది. ప్రత్యేకంగా డిజైనర్లను కూడా నియమించింది. ఫలితంగా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో ఉత్పత్తులు పెరిగాయి. సంఘానికి వివిధ రూపాల్లో ఏడాదికి రూ.60 లక్షల వరకు ఆర్థిక చేయూత దక్కింది. వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేల ప్రకారం ఐదేళ్లు అందించింది.

రూ.6 కోట్ల నష్టాలు!

ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం నష్టాల్లో కూరుకపోయింది. 2024–25 ఆడిట్‌ రిపోర్టు ప్రకారం ఈ సంఘానికి ఉన్న నష్టాలు రూ.6 కోట్లు. 2025–26 సంవత్సరంలో ఆడిట్‌ చేస్తే నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 16 అవుట్‌లెట్స్‌ (షోరూములు) ఉన్నాయి. ఒక షోరూం ద్వారా రోజుకు జరుగుతున్న వ్యాపారం కేవలం రూ. 2500 మాత్రమే. 16 షోరూములలో రోజుకు జరుగుతున్న వ్యాపారం కేవలం రూ.40 వేలు మాత్రమే. అంటే నెలకు రూ.12 లక్షల వరకు వ్యాపారం జరగుతోంది.

గణనీయంగా పడిపోయిన

చేనేత వస్త్రాల ఉత్పత్తి

చేనేత కార్మికులను ఆదుకోని

చంద్రబాబు ప్రభుత్వం

ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని

ఆప్కో పరం చేసేందుకు అడుగులు

తొలి దశలో ఆప్కో ఉత్పత్తుల

అమ్మకాలు

మలి దశలో విలీనం చేసేందుకు

కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement