● మాజీ ఎమ్మెల్యే కాటసాని
రాంభూపాల్‌రెడ్డి
ఓర్వకల్లు: ప్రభుత్వ భూముల్లో బినామీ పేర్ల ప్రక్రియను తక్షణమే అరికట్టాలని, నిజమైన రైతులకు మాత్రమే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ విద్యాసాగర్‌ను కలిసి భూముల అన్యాక్రాంతమవుతున్న అంశంపై సమగ్రంగా చర్చిరించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. మండలంలోని చింతలపల్లె, గుట్టపాడు, ఓర్వకల్లు గ్రామాల్లో భూములు బినామీ పేర్లమీద నమోదవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వాస్తవంగా సాగులో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014– 2019 వరకు భూములను సాగు చేసుకున్న రైతులు, అప్పట్లో అర్జీలు సమర్పించిన వారు, కోర్టులను ఆశ్రయించిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన రైతులను గుర్తించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా వ్యవహరించి వాస్తవంగా భూములను సాగు చేసుకున్న రైతులకు మాత్రమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఓర్వకల్లు గ్రామ రెవెన్యూ పరిధిలో 440–488 సర్వే నంబర్లలో సుమారు 48 సర్వే నంబర్లలో బినామీ పేర్ల మీదుగా ఎంట్రీలు జరుగుతున్నాయని ఆరోపించారు. అదే విధంగా చింతలపల్లె గ్రామంలో కూడా బినామీ వ్యక్తుల పేర్లు నమోదు జరుగుతోందన్నారు. ఇప్పటికై న బినామీ పేర్లమీద నమోదు చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లించకుండా, నిజమైన లబ్దిదారులకు మాత్రమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బినామీల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాటసాని వెంట జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్‌గౌడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, చేట్ల అనిల్‌కుమార్, బి.ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


