నంద్యాల(అర్బన్): చాబోలు గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను సెంట్రల్ మానిటరింగ్ టీం సభ్యులు పరిశీలించారు. టీం లీడర్ అజయ్‌కుమార్ సాహు, రూబల్ కుమార్‌లు ఎస్‌ఏ జీవై, ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఎస్, పీఆర్, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, డీఆర్‌డీఏ, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పెన్షన్స్ రికార్డులను పరిశీలించి ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన కూలీలందరికీ పను లు కల్పించాలని, పనులు, కొలతల్లో తేడాలు లేకుండా చూడాలని సూచించారు. వారి వెంట పీఆర్ డీఈ మోహన్‌రావు, ఎంపీడీఓ సుగుణశ్రీ, డిప్యూటీ ఎంపీడీఓ శివనాగజ్యోతి, ఏపీడీ సాంబశివరావు, కోర్స్ డైరెక్టర్లు ఏసుదాసు, పరమేష్, పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఏఈఓ గనేష్, ఈసీ మగ్బుల్, వెలుగు ఏపీఎం రామశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నీటి ఎత్తిపోతల నిలిపివేత
జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కర్నూలు–కడప కాల్వకు నీటిసరఫరా నిలిపివేశారు. కేసీ కాల్వకు మూడు మాసాల క్రితమే సుంకేసుల డ్యాం నుంచి నీటిసరఫరా నిలిచిపోగా, రైతుల ఆందోళనల నేపథ్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా వారం క్రితం వరకు నీటిని విడుదల చేశారు. 2025–26 ఏడాదికి గాను కేసీ కాల్వకు నీటిసరఫరా నిలిపివేశారు. 2026–27 ఏడాదికి గాను వర్షాలు సంవృద్ధిగా కురిస్తే జూలై, ఆగస్టు మాసంలో కేసీ కాల్వకు సాగునీటిని సరఫరా చేసే అవకాశాలున్నాయి. కాగా తాగునీటి అవసరాల నిమిత్తం కేసీ కాల్వకు సుంకేసుల డ్యాం నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటితో పాటు ముచ్చుమర్రి వద్ద నిల్వ చేసిన 200 క్యూసెక్కుల నీటిని పశువులు, జీవాలు, తాగునీటి అవసరాల నిమిత్తం కాల్వకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
నేడు మూడు మండలాలకు ఎల్లో అలర్ట్
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా నిప్పుల కుంపటిగా మారుతోంది. ఈ నెల 11న నంద్యాల జిల్లాలోని పలు మండలాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శనివారం వెలుగోడులో 44.5, ఆత్మకూరులో 44.8, కొత్తపల్లిలో 44.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా శుక్రవారం బనగానపల్లిలో 42.3, నంద్యాల రూరల్ లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 41.9, చాగలమర్రిలో 41.9, సంజామలలో 41.8, రుద్రవరంలో 41.7, కర్నూలులో 41.4, గడివేములలో 41.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆళ్లగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావు
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన నెల్లూరు ఎస్‌బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి రానున్నారు. గతంలో ఇక్కడ డీఎస్పీగా విధులు నిర్వహించిన ప్రమోద్ రిలీవ్ అయిన విషయం తెలిసిందే.
ఖరీఫ్ సీజన్‌కు విత్తనాల కేటాయింపు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు విత్తనాలు కేటాయిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు విత్తనాల కోసం పంపించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనపెట్టి అరకొరగా కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 12,674 క్వింటాళ్లు, రబీ సీజన్‌కు 9480 క్వింటాళ్లు కేటాయించింది. వేరుశనగ కర్నూలు జిల్లాకు 10,723 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2136 క్వింటాళ్లు, కొర్ర కర్నూలు జిల్లాకు 76 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 27 క్వింటాళ్లు, మినుములు నంద్యాల జిల్లాకు 40 క్వింటాళ్లు చొప్పున కేటాయించింది. కర్నూలు జిల్లాలో కూడా మినుము సాగవుతున్నప్పటికీ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. పచ్చ రొట్ట ఎరువుల విత్తనాలైన దయంచ కర్నూలు జిల్లాకు 1,681 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 5,685 క్వింటాళ్లు, సన్‌హెంప్ విత్తనాలు కర్నూలు జిల్లాకు 4 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 76 క్వింటాళ్లు, పిల్లి పెసర విత్తనాలు కర్నూలు జిల్లాకు 190 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 1516 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది.


