హోరాహోరీగా బండలాగుడు పోటీలు
వెల్దుర్తి: శ్రీరంగాపురం కొండల్లో కొలువైన పాలుట్ల రంగస్వామి ఆలయ ఆవరణలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బుధవారం న్యూ కేటగిరి వృషభాలకు నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. రాత్రి వరకు కొనసాగిన పోటీల్లో రెండు జతలు సరాసరి 6300 అడుగుల దూరాన్ని లాగిన నాగర్‌కర్నూలు జిల్లా రాయవరం గ్రామానికి చెందిన ధనుష్‌రెడ్డి, అక్షరరెడ్డి వృషభాలు సంయుక్త విజేతలుగా నిలిచాయి. యజమానులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు (రూ.40వేలు, రూ.30వేలు) కలిపి ఒక్కొక్కరికి రూ.35వేలు అందజేశారు. తర్వాతి మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో అనంతపురం జిల్లా నారాయణపురం మహమ్మద్ ఫరీద్ వృషభాలు, కర్నూలు పంచలింగాల సుంకన్న బ్రదర్స్, నంద్యాల జిల్లా బిల్లలాపురం భూమా గోవర్ధనరెడి ఎద్దులు నిలిచాయి. వరుసగా రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేల నగదు బహుమతులను నిర్వాహకులు, దాతలు వృషభ యజమానులకు అందజేశారు.


