శ్రీశైలంలో ‘స్వయం’ కృతాపరాధం!
● ప్రభుత్వానికి ఏటా రూ.43కోట్లు
భక్తుల సొమ్ము చెల్లింపు
శ్రీశైలంటెంపుల్: రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం కావడంతో శ్రీశైలానికి తిరుమల తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించాల్సి ఉంది. అలా చేస్తే క్షేత్రానికి ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారు. ప్రభుత్వానికి ఏటా చెల్లించే ఫండ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే శ్రీశైల దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కలగా మారింది. గత ట్రస్ట్‌బోర్డు శ్రీశైల దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కొరుతూ సుమోటో అజెండాగా చర్చించి కమిషనర్‌కు పంపారు. అటు తరువాత ట్రస్ట్‌బోర్డు కాలపరిమితి పూర్తవడంతో ఈ ఫైల్ అటకెక్కింది. క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. స్వయంప్రతిపత్తి కల్పిస్తే క్షేత్ర అభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది.
ఏటా ప్రభుత్వానికి
రూ.43 కోట్లపైనే చెల్లింపు
శ్రీశైల దేవస్థానానికి స్వయంప్రతిపత్తి లేని కారణంగా ఉభయ దేవాలయాల్లో హుండీలలో, దేవస్థానానికి భక్తులు సమర్పించే కానుకల్లో ప్రభుత్వానికి ఏటా రూ.కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. కామన్ గుడ్ ఫండ్ కింద 9 శాతం, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఫండ్ కింద 8 శాతం, అర్చక వెల్పేర్ ఫండ్ కింద 3 శాతం, ఆడిట్ ఫీజు కింద 1.5శాతం ఇలా మొత్తం 21.5 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. ఉదాహరణకు శ్రీశైల దేవస్థానానికి ఏడాదికి సుమారు రూ.200కోట్లు ఆదాయం వస్తే అందులో 21.5శాతం అంటే సుమారు రూ.43కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా భక్తులు సమర్పించిన సొమ్ము స్వయంప్రతిపత్తి లేక ఏటా ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది.


