అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
● మాజీ మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ రెడ్డి
బేతంచెర్ల: ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకరావాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో వాకింగ్ ట్రాక్‌ను బుధవారం పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతోపాటు అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్ర బాబునాయుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. అనంతరం ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. వాకింగ్ ట్రాక్ వెంట నడిచి మైదానం పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డికి సూచించారు.
గిట్టుబాటు ధర లభిస్తుందా?
బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మాజీ మంత్రి బుగ్గన సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధిపై గ్రామాల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందా, దిగుబడులు , ఎరువుల కొరత తదితర అంశాలపై చర్చించారు. మద్దతు ధర లేదని, యూరియా కొరత ఉందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు రైతులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, సీనియర్ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ చంద్రుడు, పట్టణ, మండల కన్వీనర్ తిరుమలేశ్వర్‌రెడ్డి , జాకీర్, సుబ్బారెడ్డి, మహబూబ్, గోరుమానుకొండ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


