సమస్యలకు వెంటనే పరిష్కారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): జిల్లాలోని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గతేడాది జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే 97 శాతం వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో అదనంగా 65 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయన్నారు. చేపల ఉత్పత్తి 44 వేల టన్నుల నుంచి 67 వేల టన్నుల వరకు పెరిగిందన్నారు. మొత్తం రూ.78.87 కోట్ల పెట్టుబడితో 1,476 సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి 5,560 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వివరించారు. నూతన ఏడాది మరింత అభివృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ల స్వీకరణ
నంద్యాల(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల నుంచి జీవన ధ్రువపత్రాలు (లైఫ్ సర్టిఫికెట్లు) జనవరి 01 నుంచి ఫిబ్రవరి 28 వరకు సబ్ ట్రెజరీలు, జిల్లా ట్రెజరీ కార్యాలయంలో స్వీకరిస్తామని జిల్లా ఖజానా, గణాంకాల అధికారి శ్రీమతి ఎం.లక్ష్మీదేవి తెలిపారు. పెన్షనర్లు తమ జీవన ధ్రువపత్రాలను ట్రెజరీ కార్యాలయాల్లోనే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్‌లో ఎక్కడి నుంచైనా సమర్పించవచ్చని పేర్కొన్నారు. మొబైల్‌లో ‘జీవన్ ప్రమాణ్’ యాప్ ద్వారా కూడా జీవన ధ్రువపత్రాలు సమర్పించే సదుపాయం ఉందని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 28లోపు జీవన ధ్రువపత్రాల నమోదు పూర్తి చేయని పెన్షనర్లకు మార్చి నెల పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉందన్నారు.
సబ్ జైలు ఆకస్మిక తనిఖీ
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల స్పెషల్ సబ్ జైలును మండల లీగల్ సేల్ అధ్యక్షులు, మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి జైలు నందు ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ హెల్ప్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్‌ను తనిఖీ చేసి దాని గురించి అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్‌కు 15100 సమాచారం తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జైలు అధికారి గురుప్రసాదరెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, లీగల్ ఎయిడ్ న్యాయవాది పాల్గొన్నారు.
కొందరికే పాసుపుస్తకాలు
దొర్నిపాడు: భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్‌పుస్తకాలను జనవరి 2 నుంచి రైతులకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కానీ మండలంలో మొదటి విడత గుండుపాపల, బుర్రారెడ్డిపల్లె, కొండాపురం గ్రామాల్లో భూరీసర్వే పూర్తి చేశారు. అలాగే రెండో విడత భూ రీ సర్వేలో భాగంగా క్రిష్టిపాడు, డబ్ల్యూ గోవిందిన్నె గ్రామాల్లో చేశారు. కానీ ప్రస్తుతం మొదటి విడత పూర్తయిన గుండుపాపల 267, బుర్రారెడ్డిపల్లె 250, కొండాపురం 365 పాస్‌పుస్తకాలు మాత్రమే వచ్చాయి. క్రిష్టిపాడు, డబ్ల్యూగోవిందిన్నె గ్రామాల రైతులకు పుస్తకాలు రాలేదు. అలాగే రీ సర్వే అయిన భూములకు సంబంధించి ల్యాండ్ సీలింగ్, ప్రభుత్వ, డీ పట్టాలకు భూములకు ఆన్‌లైన్‌లో ఆర్‌ఓఆర్, అడంగల్ రావడం లేదని రైతులు వాపోతున్నారు. బ్యాంకు రుణాలు పొందాలన్నా, రీ షెడ్యూల్ చేసుకోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.


