‘గోళీ’ గుడ్డు
కోవెలకుంట్ల: నాటు కోడి గుడ్డు బరువు సాధరణంగా 40 నుంచి 70 గ్రాముల వరకు ఉంటుంది. కోవెలకుంట్లలోని మహబూబ్‌బాషాకు చెందిన కోడిపెట్ట రెండు రోజులు సాధారణ గుడ్లు పెట్టింది. బుధవారం గోళీ సైజులో ఉన్న చిన్న గుడ్డు పెట్టింది. దాని బరువు 11 గ్రాములు మాత్రమే ఉంది. కోడిపెట్టలో కాల్షియం లోపంతో కొన్ని సందర్భాల్లో చిన్నసైజులో గుడ్లు పెట్టే అస్కారం ఉందని పశువైద్యాధికారి కృష్ణకుమార్ తెలిపారు.
3న నంద్యాల జిల్లా ఎపీఎన్‌జీజీవోస్ ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎన్‌జీజీవోస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు జనవరి 3న జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలనే తాత్కాలికంగా అడ్‌హాక్ కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. తాజాగా పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్, సహాయ ఎన్నికల అధికారిగా వైఎస్‌ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివప్రసాద్ నియమితులయ్యారు. నంద్యాలలోని ఎన్‌జీవో హోమ్‌లో ఎన్నికల ప్రక్రియ చేపడుతారు. కర్నూలు జిల్లాకు కూడా అడ్‌హాక్ కమిటీ ఉంది. ఇటీవలనే అన్ని తాలూకాలకు ఎన్నికలు నిర్వహించారు. మరో వారం రోజుల్లో కర్నూలు జిల్లా ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.
కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ మాటలకే పరిమితమైంది. జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. అయితే బుధవారం ఉదయం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కొద్దిసేపు ఇళ్ల దగ్గర పింఛన్లు పంపిణీ చేసి, ఆ తర్వాత యథావిధిగా సచివాలయాలు, రచ్చబండల వద్దకు పిలిపించారు. అందరినీ ఒక చోటకు చేర్చి పంపిణీ చేపట్టారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కల్లూరు మండలం ఏ.గోకులపాడులో పింఛన్లు పంపిణీ చేశారు. 36 మంది సచివాలయ ఉద్యోగులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ చేపట్టడంతో కలెక్టర్ ద్వారా నోటీసులు ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయానికి పింఛన్ల పంపిణీలో కర్నూలు జిల్లా 5వ స్థానంలో నిలిచింది.
జెడ్పీ, మండల పరిషత్‌లకు రూ.25.69 కోట్లు
కర్నూలు(అర్బన్): 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత 15వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్, ఉమ్మడి జిల్లాలోని 53 మండల పరిషత్‌లకు విడుదలైన రూ.25,69,77,536 ఆయా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిషత్‌కు 10 శాతం వాటా మేరకు బేసిక్ గ్రాంట్ రూ.3,42,63,671, టైడ్ గ్రాంట్ కింద రూ.5,13,95,506 జమ చేశారన్నారు. అలాగే మండల పరిషత్‌లకు 20 శాతం వాటా మేరకు బేసిక్ గ్రాంట్ కింద రూ.6,85,27,344, టైడ్ గ్రాంట్ కింద రూ.10,27,91,015 బ్యాంకుల్లో జమయ్యాయన్నారు. ఈ నిధులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఖర్చు చేయాలని ఆయన ఎంపీడీఓలను ఆదేశించారు. కాగా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బనగానపల్లె మండలానికి రూ.58,48,351, అత్యల్పంగా గూడురు మండలానికి రూ.13,69,314 విడుదలయ్యాయి.
మాన్యం భూములతో
రూ.18.51 కోట్ల ఆదాయం
చాగలమర్రి: నంద్యాల జిల్లాలో 1,874 ఆలయాలు, 37,500 ఎకరాల విస్తీర్ణంలో మాన్యం భూములున్నాయని, వీటి ద్వారా ప్రతి యేట రూ.18.51 లక్షల ఆదాయం లభిస్తుందని జిల్లా ఎండోమెంట్ అధికారి ఎస్. మోహన్ వెల్లడించారు. బుధవారం మండలంలోని మద్దూరు గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి వెండి ఆభరణాల అపహరణపై విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారి మూల విరాట్ విగ్రహాన్ని, స్వామికి అలంకరించిన నకిలీ ఆభరణాలను పరిశీలించారు. ఆలయ ఈఓ జయచంద్రారెడ్డితో స్వామి అభరణాల సంఖ్య, వాటి విలువను ఆడిగి తెలుసుకున్నారు.


