ప్రజలకు ఉత్తమ సేవలు అందించండి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఉద్యోగాల్లోకి కొత్తగా వచ్చిన వారందరూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కోరారు. బుధవారం జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు పోస్టులకు అర్హత, వారి అభీష్టం మేరకు 26 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించారు. అలాగే జెడ్పీ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో రికార్డు అసిస్టెంట్, ల్యాబ్, లైబ్రరీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 13 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి ఖాళీగా ఉన్న కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు, పదోన్నతులు పొందిన వారికి జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డితో కలిసి ఆయన నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పోస్టింగ్స్ విషయంలో సాధ్యమైనంత వరకు వారికి అనుకూలమైన ప్రదేశాలలోనే నియమించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


