మేత.. బంగారమాయే..!
అర్ధకాలితో అలమటిస్తున్న మూగజీవాలు
ట్రాక్టర్ వేరుశనగ మేత రూ. 25 వేలు
కృష్ణగిరి: గడ్డికి గడ్డుకాలం మొదలైంది. అధిక వర్షాభావ పరిస్థితులు అన్నదాతకు పెట్టుబడులు నెత్తికి తీసుకరావడమే కాక నోరు ఎరగని మూగజీవాలను అర్ధకాలితో సరిపెట్టాల్సి వస్తోంది. రైతులు పంటలు పండక పోయినా మరో ఏడాది వస్తుందిలే అని ఎదూరుచూస్తున్న సమయంలో పశువుల మేత కొరతతో చేసేదిమిలేక కబేళాలకు తరలిస్తున్నారు. కొద్దో గొప్పో అర్థికంగా ఉన్న రైతులు తమ ఎద్దులను, పశువులను అమ్ముకోలేక వరిగడ్డి, వేరుశనగ మేతను అధిక ధరకు కొని తెచ్చుకుంటున్నారు. ట్రాక్టర్ వరిగడ్డి రూ.15 వేలు, అలాగే వేరుశనగను రూ.25 వేలకు కొంటున్నట్లు రైతులు తెలిపారు. ఈయేడాది అధిక వర్షాలకు వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినడంతో మేతను పొలాల్లోనే వదిలేశారు. ప్రభుత్వం కేవలం ఆరకొరగా దాణా ఇచ్చి చేతులు దులుపుకుంది. పశుగ్రాసం కొరతతో ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని అదుకునేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ఇప్పుటికైనా ప్రభుత్వం రాయితీ కింద పశువుల మేత, దాణను ఇవ్వకపోతే పశులను అమ్ముకోక తప్పదని రైతులు వాపోతున్నారు.
మేత.. బంగారమాయే..!


