
కూటమి ప్రభుత్వం ‘సూపర్ ఫెయిల్యూర్’
● వెరిఫికేషన్ పేరుతో పింఛన్‌దారుల వైకల్య శాతం తగ్గించడం దారుణం ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: కూటమి ప్రభుత్వం హామీల అమలులో సూపర్‌గా ఫెయిల్యూర్ అయ్యిందని వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్య విరూపాక్షి విమర్శించారు. ఆలూరులోని ఆర్ అండ్ బీ అథితి గృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోగా ఉన్న పింఛన్లు తీసేస్తుండటం సిగ్గుచేటన్నారు. 90 శాతం వైకల్యం ఉన్నా వెరిఫికేషన్ పేరుతో 40 శాతం లోపే ఉందంటూ పింఛన్లు నిలిపేయడం సమంజసం కాదన్నారు. జిల్లా వ్యాప్తంగా నిలిపేసిన 8,300 వికలాంగుల పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలన్నారు. నకిలీ పింఛన్ల ఏరివేత పేరుతో అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించేందుకు కుట్ర పన్నితో భవిష్యత్‌లో బాధితుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేసి వైకల్యం ఉన్న వారిని గుర్తించి ధ్రువపత్రాలు జారీ చేసి, అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష్యసాధింపు చర్యల్లో భాగంగానే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో వైలక్య శాతం తగ్గించి పింఛన్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మల్లికార్జున, ఎంపీటీసీ దేవరాజు, వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.