
అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
రూ.10.85 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం
ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా
నంద్యాల: ఎనిమిదేళ్లుగా దొంగతనాలు, దారిదోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణా తెలిపారు. మంగళవారం ఎస్సీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. బండిఆత్మకూరు మండలం నెమళ్ల కుంట గ్రామానికి చెందిన చెంచు దాసరి అంకన్న, పాణ్యం మండలం చెంచు కాలనీకి చెందిన బాపట్ల సత్యహరిశ్చంద్రుడు, పాణ్యం చెంచు కాలనీకి చెందిన బాపట్ల చిన్న హుసేని, గడివేముల మండలం కరిమద్దెల గ్రామానికి చెందిన చెంచు దాసరి జమ్ములు ముఠాగా ఏర్పడి నంద్యాల, కర్నూలు, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, గుంటూరు జిల్లాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడ్డారు. దొంగిలించిన బంగారు, వెండి వస్తువులు, నగదును పాణ్యం మండలం పిన్నాపురం కొండల వద్ద దుర్గం వాగులో ఉన్న వాటర్ ఫాల్స్ సమీపంలో గుడారాలు వేసుకొని అందులో దాచి పెట్టేవారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఘటనల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కా నిఘా ఉంచి గుడారాల్లో ఉన్న దొంగల ముఠాను చాకచక్యంగా పట్టుకున్నారు. విచారణలో రాత్రి సమయాల్లో రోడ్డు పక్కన దారిదోపిడీలు చేసినట్లు, తాళాలు వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు నిందితులు అంగీకరించారు. వీరి వద్ద నుంచి రూ.10.85 లక్షలు విలువ చేసే 11 తులాల బంగారం, 21 తులాల వెండి, రూ.10 వేల నగదు, రెండు బైక్‌లు, నాలుగు పిడిబాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ అభినందించి, నగదు రివార్డు అందజేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, సబ్ డివిజన్ ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్ పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్