
హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
కర్నూలు: తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని నన్నూరు గ్రామంలో ఆటో డ్రైవర్ అజాం ఖాన్ సలాంబాషా హత్య కేసు నిందితుడు బోయతోట శివ (35)కు జీవిత ఖైదు, రూ.6 వేలు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు.. నన్నూరుకు చెందిన బోయతోట శివ రౌడీ షీటర్. ఇతనిపై పలు క్రిమినల్ కేసులున్నాయి. 2017 నవంబర్ 19న గ్రామంలోని అయూబ్ టీ హోటల్ వద్ద ఉన్న అజాం ఖాన్ సలాంబాషాపై బోయతోట శివ కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అజాంఖాన్ సలాంబాషాను అక్కడే ఉన్న అతని సోదరుడు అజాం షాలీఖాన్, మరికొందరు కలిసి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు ఓర్వకల్లు పోలీసులు కేసు నమోదు చేసి అప్పటి కర్నూలు రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ నాగరాజు యాదవ్ నిందితుడిని అరెస్టు చేసి 20 మంది సాక్షులను విచారణ చేసి చార్జిషీటును కోర్టులో దాఖలు చేశారు. నిందితుడు బోయ తోట శివపై హత్య నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరామిరెడ్డి ప్రాసిక్యూషన్ తరపున వాదించారు. నిందితుడికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.