
ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ముగిసింది. జిల్లా పోలీసు కార్యాలయ పరేడ్ మైదానంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో రెండో రోజు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది. వెరిఫికేషన్ ప్రక్రియ కోసం డీపీఓ గ్రౌండ్‌లో మొత్తం 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలన్నిటినీ డీపీఓ సిబ్బంది సమగ్రంగా పరిశీలించారు. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా సర్టిఫికెట్లతో పాటు ఇతర కేటగిరీలకు సంబంధించిన ధ్రువపత్రాలను సక్రమంగా పరిశీలించారు. సివిల్, ఏపీఎస్పీ విభాగాలకు ఎంపికై న 643 మంది అభ్యర్థులు వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరు కావలసి ఉండగా 617 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు రోజులుగా పరేడ్ మైదానం కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులతో కోలాహలంగా మారింది. సివిల్ విభాగంలో 309 మందికి గాను 298 మంది, ఏపీఎస్పీ విభాగంలో 334 మందికి గాను 319 మంది హాజరయ్యారు. రెండు విభాగాలకు కలిపి 26 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేదు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుసేన్ పీరా, కృష్ణమోహన్, డీపీఓ ఏఓ విజయలక్ష్మి, ఆర్‌ఐలు జావేద్, సోమశేఖర్ నాయక్, డీపీఓ సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.
పళ్ల బాస్కెట్‌లో పాము కలకలం
పత్తికొండ: విక్రయానికి తీసుకొచ్చిన దానిమ్మ పండ్లు బాస్కెట్‌లో మంగళవారం పాము కలకలం రేపింది. పత్తికొండకు చెందిన భానుప్రకాష్ రోడ్డు పక్కన తోపుడుబండి మీద పండ్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజువారీగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న పండ్ల బాస్కెట్‌లను సర్దుకుంటుండగా దానిమ్మ పండ్ల బాస్కెట్‌లో అడుగున పాము కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. అనంతరం తోటి వ్యాపారుల సహకారంతో పామును సంచిలో బంధించి అడవిలో వదిలిపెట్టాడు. సుదూర ప్రాంతాల నుంచి పండ్లు దిగుమతి చేసుకుంటామని, బాస్కెట్‌లోకి పాము అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చని వ్యాపారి అనుమానం వ్యక్తం చేశాడు.
టౌన్ ప్లానింగ్‌లో ఇద్దరికి మెమోలు
కర్నూలు (టౌన్): నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశాలను ఖాతరు చేయని పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులకు మంగళవారం మెమోలు జారీ చేశారు. కమిషనర్ ఇంటి సమీపంలో 2వ సచివాలయం పరిధిలోని నరసింగరావు పేటలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారు. బిల్డింగ్‌కు సంబంధించి నిర్మాణాల్లో డివియేషన్‌తోపాటు సెట్‌బ్యాక్స్ వదలక పోవడాన్ని గమనించిన కమిషనర్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శికి చెప్పి పనులు నిలిపివేయాలని ఆదేశించారు. ఆయినా వారు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కమిషనర్ బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ పి.ఖాశీం, ప్లానింగ్ కార్యదర్శి సుహేయిల్ జిక్రాఖాన్‌లకు మెమోలు జారీ చేశారు. రెండు రోజుల్లో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ముగిసిన ధ్రువపత్రాల పరిశీలన