
వేర్వేరు చోట్ల పాముకాటుతో ముగ్గురు మృత్యువాత
పొలంలో పని చేస్తుండగా..
ఆలూరు రూరల్/ నందవరం: ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేర్వేరు చోట్ల పాముకాటుతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వ్యవసాయ పనులు చేస్తుండగా పాముకాటుకు బలయ్యారు. ఆలూరు మండలంలోని కమ్మరచేడు గ్రామానికి చెందిన మంగమ్మ (45) బుధవారం ఉదయం పత్తి పొలంలో ఎరువులు చల్లేందుకు వెళ్లింది. ఎరువుల చల్లుతుండగా కాలుకు పాము కాటు వేసింది. బంధువులు గమనించి చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలికి భర్త మహానంది, ఇద్దరు సంతానం ఉన్నారు.
గడ్డి కోస్తుండగా..
మండల కేంద్రం నందవరంలో పాము కాటుకు గురై రైతు రాజోలి శ్రీఆంజనేయులు(37) బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ కేశవ తెలిపిన వివరాలు మేరకు..గ్రామంలో సోమవారం రైతు తన పొలంలో పశువులకు గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య సేవలందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృత్యువాత పడ్డాడు. మృతుడి తండ్రి పెద్దింటి చిన్న తిమ్మప్ప ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతిడికి భార్య శివమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
డోన్ టౌన్: వెంకటనాయునిపల్లె గ్రామానికి చెందిన సతీష్‌కుమార్ (28)పాము కాటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పని చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషాదఛాయలు అములుకున్నాయి.

వేర్వేరు చోట్ల పాముకాటుతో ముగ్గురు మృత్యువాత