
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలం డ్యామ్ సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండరాళ్లు స్వల్పంగా విరిగిపడగా.. ఆ సమయంలో ఎవ్వరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. కొండచరియలు విరిగిపడటంతో శ్రీశైలం-హైదరాబాద్ రహదారి కావడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. శ్రీమఠం పరిసర ప్రాంతాల్లో వర్షపు ప్రవహిస్తుండటంతో భక్తుల ఇక్కట్లు పడుతున్నారు. వసతి గృహాలు లేక ఇబ్బందులు పడుతున్న భక్తులకు హెచ్‌ఆర్‌బీ, టీటీడీ కళ్యాణ మండపాల్లో ఉచిత వసతి ఏర్పాట్లు చేయించారు.
ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకి వరద ఉధృతంగా వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వరద ప్రవాహ హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కృష్ణా, గోదావరి పరివాహక జిల్లాల్లోని క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు వెల్లడించారు.

ప్రజలు వరద సమాచారం, సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112,1070,18004250101 సంప్రదించాలన్నారు. వినాయక నిమజ్జన సమయంలో నదీ, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు. రేపు మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
గురువారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.43 లక్షల క్యూసెక్కులు ఉందని, మొదటి హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.38, ఔట్ ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 3.18, ఔట్ ఫ్లో 2.46 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.70, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఉందన్నారు.


మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38.6 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో 5.31, ఔట్ ఫ్లో 5.30 లక్షల క్యూసెక్కులు ఉందని, శనివారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి,ఆదివారంలోపు దాదాపు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు. నదుల ప్రవాహంతో వివిధ ప్రాజెక్టులలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు