కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో పలువురికి పదవులు దక్కాయి. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీలో పలువురిని వివిధ హోదాల్లో నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మోతే చిన్న వీరేష్ (రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి) వంగాల మేఘనాథ్ రెడ్డి (రాష్ట్ర వలంటీర్ల విభాగం కార్యదర్శి) గడ్డం కేశవ రెడ్డి (రాష్ట్ర బూత్ కమిటీ విభాగం సంయుక్త కార్యదర్శి)లను నియమించింది.
పంచాయతీరాజ్ ఎస్‌ఈగా వేణుగోపాల్
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజినీరు(ఎస్‌ఈ)గా ఐ.వేణుగోపాల్ నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఈఈలుగా పనిచేస్తున్న 15 మందికి ఎస్‌ఈలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్‌కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న ఎస్‌ఈ పోస్టులో ప్రకాశం జిల్లా ఈఈగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్‌ను నియమించింది. అలాగే కర్నూలులో ఈఈగా పనిచేస్తున్న ఎస్.సి.ఈ.మద్దన్నను కడప ఎస్‌ఈగా, మరో ఈఈ ఎం.రామ్మెహన్‌ను సీఆర్‌డీఏకు, వై.చిన్నసుబ్బరాయుడును అనంతపురం ఎస్‌ఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
వెల్దుర్తి: రామళ్లకోట గ్రామానికి చెందిన రైతు కొట్టం రామా నాయుడు (33) బుధవారం విద్యుదా ఘాతంతో మృతి చెందాడు. ఉదయం తన భార్య పద్మావతితో కలిసి గ్రామానికి దూరంగా ఉన్న కొండ పొలానికి వెళ్లాడు. సాగు చేసిన మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు బోరు మోటార్ ఆన్ చేశాడు. సాయంత్రం ముందుగానే భార్య ఇంటికి వెళ్లగా, నీళ్లు కట్టడం పూర్తయిన తర్వాత వస్తానని చెప్పిన భర్త పొద్దుపోయినా రాకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. కుటుంబీకులతో కలసి పొలం వద్దకు వెళ్లి చూడగా రామానాయుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. బోర్ మోటార్ ఆఫ్ చేసే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి కు మారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు.
నేటి నుంచి తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
కర్నూలు కల్చరల్: టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి 31వ తేదీ వరకు తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య పేర్కొన్నారు. గురువారం కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో నాటక రంగం చరిత్రంలో ఇలాంటి కార్యక్రమం జరగలేదని అందుకే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కార్యక్రమాన్ని తమ రికార్డ్స్‌లో నమోదు చేయనుండటం జిల్లాకు జిల్లా కళాకారులకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. 31వ తేదీ ఉదయం 10.30 గంటలకు తాను రచించిన పదవి మూలం ఇదం జగత్ అధి‘కారము’ పుస్తకావిష్కరణ ఉంటుందన్నారు. సాయంత్రం 6.30 గంటలకు వ్యాసరచన పోటీల విజేతలు, ఏకపాత్రాభినయం పోటీల విజేతలు ఇతర కళాకారులు మొత్తం 150 మందికి సన్మానం ఉంటుందన్నారు.