
భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు
ఆత్మకూరురూరల్/ఆత్మకూరు: నల్లమల అడవుల్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆత్మకూరు మండలంలో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటమునిగి వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే ఆత్మకూరు నుంచి కొత్తపల్లె మండలానికి వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఆత్మకూరు మండలంలో భవనాశి కొండవాగు ఉధృతంగా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మునిమడుగులేరుకు నీటి ప్రవాహం పెరిగింది. ఈ వాగుపై నిర్మించిన శివ భాష్యం సాగర్ క్రస్ట్ గేట్లలో రెండింటిని ఎత్తివేశారు. ప్రాజెక్ట్ నుంచి విడుదలైన వరద జలాలు నేరుగా భవనాశి వాగులోకి రావడంతో ఆ వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఈ వాగుపై కట్టిన అన్ని కల్వర్టులు, బ్రిడ్జిల పైన వాగు ప్రవహించడంతో కురుకుంద, కొట్టాల చెర్వు, వడ్లరామాపురం గ్రామాలకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. ఆత్మకూరు సమీపంలో భవనాశి వాగుపై ఉన్న బ్రిడ్జిపై కూడా నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో మొత్తం కొత్తపల్లె మండలానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొత్తపల్లి మండలంలోని 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రహదారులపై వరద నీరు ఎక్కి పారుతున్న చోట్ల ఆత్మకూరు అర్బన్ సీఐ రాము నేతృత్వంలో పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు.
నంద్యాల జిల్లాలో వర్షపాతం వివరాలు..
నంద్యాల(అర్బన్): నంద్యాల జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు వర్షం కురసింది. శ్రీశైలంలో అత్యధికంగా 78.4మి.మీ వర్షం కురియగా కోవెలకుంట్ల, గోస్పాడు మండలాల్లో అత్యల్పంగా 1.0 మి.మీ వర్షం కురిసింది. నందికొట్కూరులో 41.8, పగిడ్యాల 36.8, మిడుతూరు 34.2, వెలుగోడు 33.6, జూపాడుబంగ్లా 28.8, ఆత్మకూరు, పాములపాడు 26.8, కొత్తపల్లి 22.8, గడివేముల 20.4, రుద్రవరం 5.4, దొర్నిపాడు 3.8, మహానంది 3.6, బండిఆత్మకూరు 2.2, చాగలమర్రి 1.4, శిరివెళ్ల 1.2 మి.మీ వర్షం కురిసింది.

భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు

భారీ వర్షం.. నిలిచిన రాకపోకలు