
పెట్టుబడి వేలల్లో.. ధర వందల్లో!
క్వింటా ఉల్లి రూ.100 నుంచి రూ.150తో కొంటున్న దళారీలు
టెండరుతో లభించిన ధర రూ.500 నుంచి రూ.800 వరకే
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా ఉంటోంది. దిగుబడులను కర్నూలు మార్కెట్‌కు తీసుకెళితే న్యాయం జరుగుతుందని ఆశించిన రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రోజుల తరబడి మార్కెట్‌లో ఉండలేక, కుళ్లిపోతుంటే చూడలేక దళారీలకు బొట్లకు అమ్ముకొని మార్కెట్ నుంచి కన్నీళ్లతో బయటపడుతున్నారు. ఎకరాకు సగటున రూ.80 వేల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. దిగుబడులు కనిష్టంగా 25 క్వింటాళ్లు, గరిష్టంగా 50 క్వింటాళ్ల వరకు వస్తోంది. క్వింటాకు కనీసం రూ.2వేల ధర లభిస్తేనే పెట్టుబడి దక్కుతుంది. కానీ మార్కెట్‌లో లభిస్తున్న ధరలు రైతులకు కంటతడి పెట్టిస్తున్నాయి. గురువారం ధరలు మరింత పతనమయ్యాయి. క్వింటాకు కనిష్ట ధర రూ.520, గరిష్ట ధర రూ.1,149 మాత్రమే లభించింది. ఈ గరిష్ట ధర కేవలం ఒకటి, రెండు లాట్లకు మాత్రమే. సగటు ధర రూ.739 నమోదైందంటే ఎక్కువ మంది రైతులు తెచ్చిన ఉల్లికి కేవలం రూ.500 నుంచి రూ.800 వరకు మాత్రమే ధర లభించినట్లు తెలుస్తోంది.
రూ.100–రూ.150 ధరతోకొంటున్న దళారీలు
మార్కెట్ కమిటీ నుంచి లైసెన్స్‌లు పొందిన వ్యాపారులు కొనుగోలులో చేతులెత్తేయడంతో దళారీలు కారుచౌకగా కొంటున్నారు. క్వింటా ఉల్లి గడ్డలను రూ.100 నుంచి రూ.150తో కొంటున్నారు. ఈ పరిస్థితి ఒకరిద్దరిది కాదు.. మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తెచ్చిన రైతుల్లో 50 శాతం మంది దళారీలకే అప్పగించి పోతున్నారు.
ఈ చిత్రంలోని రైతు పేరు నడిపి మద్దిలేటి. కర్నూలు మండలం ఆర్‌కే దుద్యాల గ్రామానికి చెందిన ఈ రైతు ఎకరాలో ఉల్లి సాగు చేశారు. దాదాపు రూ.80 వేలు పెట్టుబడి పెట్టగా.. దిగుబడి 36 క్వింటాళ్లు(78 ప్యాకెట్లు) వచ్చింది. ఈ నెల 25న రాత్రి మార్కెట్‌కు తీసుకురాగా, 26న టెండర్‌కు పెట్టారు. వ్యాపారులెవ్వరూ కొనుగోలు చేయలేదు. గురువారం మధ్యాహ్నం వరకు కూడా వ్యాపారులు ఈ రైతు తెచ్చిన ఉల్లిని పట్టించుకోలేదు. ఇక దళారీలు బేరం చేయడంతో 36 క్వింటాళ్లను రూ.5వేలకు తెగనమ్ముకున్నాడు. తూకం అయ్యాక దళారీలు రూ.500 కోత పెట్టి రైతు చేతిలో రూ.4,500 మాత్రమే పెట్టడం గమనార్హం.
ఉల్లి రైతు కంట కన్నీరు

పెట్టుబడి వేలల్లో.. ధర వందల్లో!