డీఎస్సీలో సాంకేతికమక | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీలో సాంకేతికమక

Aug 29 2025 6:36 AM | Updated on Aug 29 2025 8:19 AM

-

సర్టిఫికెట్ల పరిశీలనలో సాంకేతిక సమస్యలు

మధ్యాహ్నం వరకు పనిచేయని వెబ్‌సైట్‌

తరువాత ఓపెన్‌ అయినా ఆలస్యమే

ఆర్‌యూలోని కేంద్రంలో ఇంటర్నెట్‌ సదుపాయం కరువు

ఆందోళనలో డీఎస్సీ పరీక్ష రాసిన యువతీ, యువకులు

కర్నూలు సిటీ: డీఎస్సీలో ర్యాంకులు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై న వారి సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నుంచి ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం వరకు వెబ్‌సైట్‌ పనిచేయలేదు. సాంకేతిక సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ(ఆర్‌యూ)లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇంటర్నెట్‌ సదుపాయం లేదు. అధికారుల సమన్వయలోపంతో ఇంటర్నెట్‌ పని చేయలేదు. అన్ని కేంద్రాల్లో సెల్‌ఫోన్‌లోని హాట్‌స్పాట్‌ను ఓపెన్‌ చేసుకొని వెరిఫికేషన్‌ను ప్రారంభించినా వెబ్‌సైట్‌ అప్‌అండ్‌ డౌన్‌ అయ్యింది. దీంతో రెండున్నర గంటల పాటు సర్టిఫికెట్ల పరిశీలన నిలిచిపోయింది. తర్వాత తాత్కాలిక ఇంటర్నెట్‌ సదుపాయాన్ని వాడుకున్నా వెబ్‌సైట్‌ ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండడంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఒక్కొక్కరికి అర గంటకుపైగా సమయం పట్టింది. రాత్రి 8 గంటలైనా కూడా వెరిఫికేషన్‌ పూర్తి కాలేదు. దీంతో అభ్యర్థులు రాత్రి వేళల్లో శ్రీలక్ష్మీ శ్రీనివాస బీఈడీ కాలేజీలోని కేంద్రంలో ఇబ్బందులు పడ్డారు.

క్యాటగిరీ కటాఫ్‌ జాబితాపై స్పష్టత ఏదీ?

డీఎీస్సీ ప్రకటన జారీ చేసిన సమయంలో అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కానీ పరీక్షల షెడ్యూల్‌ నుంచి కీ, ఫైనల్‌ కీ, మెరిట్‌ జాబితా విడుదల అన్నింటిలోనూ అభ్యర్థులకు అనుమానాలు..ఆందోళనలే! ఉమ్మడి జిల్లాలో 2,645 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా దరఖాస్తులు చేసుకున్న వారెందరనే విషయమే ఇంత వరకు ప్రకటించలేదు. ఫైనల్‌ సెలక్షన్‌ జాబితా లేకుండా ఎంపికై న అభ్యర్థులకు కాల్‌ లెటర్లు పంపించి వెరిఫికేషన్‌ చేస్తున్నారు. గురువారం 2,307 మందికి కాల్‌ లెటర్లు ఇవ్వగా..రాత్రి 8 గంటల వరకు 1,639 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన చేశారు. శుక్రవారం 211 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను శ్రీలక్ష్మీ శ్రీనివాస బీఈడీ కాలేజీలో నిర్వహించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇంకా 127 మంది అభ్యర్థులకు కాల్‌ లెటర్లు రాలేదని విద్యాశాఖ వర్గాల గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా ఇంత వరకు ఏ క్యాటగిరీలో ఎంత కటాఫ్‌ అనే జాబితాలు విడుదల చేయలేదు. ఆ జాబితాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.

‘ప్రథమ’ వేదన

ఏ డీఎస్సీలో లేని విధంగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీలో ప్రథమ నిబంధన అమలు చేసింది. ప్రథమ పోస్టులో ర్యాంకు వస్తే అదే తీసుకోవాలి. మిగతా పోస్టుల్లో ర్యాంకు వచ్చినా ఉద్యోగం ఇవ్వరు. రాష్ట్ర ఫ్రభుత్వ నిబంధనతో జోనల్‌ స్థాయి పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాల్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది పొందలేని పరిస్థితి నెలకొంది. ఎస్‌జీటీగా పని చేస్తూ స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాలంటే 15 ఏళ్లకుపైగా సమయం పడుతుంది. కానీ టీజీటీ సాధించిన వారు ఐదేళ్లలోనే పీజీటీగా పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.

లోపాలు ఇవీ...

● మే 15వ తేదీ 2025 లోపు పోస్టు నిర్దేశించే విద్యార్హతలు పూర్తి చేసిన వారు మాత్రమే ఉద్యోగాలకు అర్హులు. దీని ప్రకారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మే 15, 2025న బీఈడీ ఫలితాలు ప్రకటించారు. అదే నెల 21న సర్టిఫికెట్లు జారీ చేశారు. మే 15న ఫలితాలు వచ్చాయని, వెరిఫికేషన్‌కు అనుమతించాలని కోరినా.. విద్యాశాఖ కమిషనర్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

● అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలో 2022–24 విద్యా సంవత్సరంలో బీఈడీ చేశారు. అయితే వర్సిటీ అకడమిక్‌ ఇయర్‌లో పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ఓ అభ్యర్థి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టును పొందేలేకపోయారు.

● ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటాలో 1, 3వ ర్యాంకు వచ్చిన వారికి కాల్‌ లెటర్‌ వచ్చింది. అయితే 2వ ర్యాంకు వచ్చిన అభ్యర్థికి కాల్‌ లెటర్‌ రాలేదు.

వెరిఫికేషన్‌ కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ

డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్న రాయలసీమ యూనివర్సిటీ , శ్రీలక్ష్మీశ్రీనివాస బీఈడీ కాలేజీ, రాఘవేంద్ర బీఈడీ కాలేజీల్లోని కేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య, జిల్లా పరిశీలకులు పాఠశాల విద్య జాయింట్‌ డైరెక్టర్‌ అబ్రహం, వయోజన విద్య అడిషనల్‌ డైరెక్టర్‌ బి.ప్రతాప్‌ రెడ్డి తనిఖీ చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌పై వారు డీఈఓ శ్యామూల్‌ పాల్‌కు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement