
శ్రీశైలంలో మృత్తికా గణపతికి విశేష పూజలు
శ్రీశైలంటెంపుల్: లోకకల్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు నిర్వహించే గణపతి నవరాత్రోత్సవాలు బుధవారం శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానాచార్యులు, అర్చకులు, వేదపండితులు, దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు దంపతులు సంప్రదాయబద్ధంగా ఆలయ ప్రాంగణంలోని స్వామివార్ల యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. పుణ్యహవచనం, కంకణాలకు శాస్త్‌త్రోకంగా పూజాదికాలు జరిపించి కంకణధారణ జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన వరసిద్ధివినాయకస్వామి (మృత్తికాగణపతి స్వామి)కి విశేషంగా పూజాదికాలు నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు ఆలయ ప్రాంగణంలోని రత్నగర్భగణపతి స్వామికి విశేషంగా అభిషేకం, అర్చనలు జరిపిస్తారు. యాగశాలలో అధిష్టింపజేసిన కాంస్య గణపతిమూర్తికి కూడా విశేష పూజలు చేస్తారు. సాక్షిగణపతి ఆలయంలోని స్వామివారికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు నిర్వహిస్తారు.
తలనీలాలతో
రూ. 51లక్షల ఆదాయం
పాణ్యం: తలనీలాల వేలంపాటతో కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి రూ. 51.77 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ రామకృష్ణ విలేకరులకు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మే రకు గురువారం ఆలయ ప్రాంణగణంలో తల నీలాలు ఏడాది పాటు పోగు చేసుకునేందుకు బహిరంగ వేలం పాట నిర్వహించామన్నారు. మొత్తం13మంది పాల్గొనగా బనగానపల్లె పట్టణానికి చెందిన బాలాంజినేయులు హెచ్చు పా ట పాడి దక్కించుకున్నట్లు తెలిపారు. గతేడాది రూ. 42లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): వయోజన విద్యశాఖలో పర్యవేక్షకులుగా పని చేసేందుకు ఉపాధ్యాయులు, భాషా పండితులు, పీఈటీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి వయోజన విద్య చైర్‌పర్సన్, జాయింట్ కలెక్టర్ నవ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 5 పర్యవేక్షక పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 45 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న వారు డిప్యూటేషన్ అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు 9849909213, 8008843200 నంబర్లను సంప్రదించాలన్నారు.
మాతాశిశు సంరక్షణకు కృషి
గోస్పాడు: మాతాశిశు సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీలో ఉన్న యూపీహెచ్‌సీలో వైద్య సిబ్బందికి పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం 2.0 కొత్త వర్షన్‌పై గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పోర్టల్‌లో గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అందిస్తున్న సేవలు నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించి మాతాశిశు మరణాలు అరికట్టాలన్నారు. జిల్లా అధికారులు డాక్టర్ సుదర్శన్‌బాబు, డాక్టర్ అంకిరెడ్డి, డీపీఓ నాజ్నీన్, ఎస్‌ఓ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు.
కేంద్రియ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు
డోన్ టౌన్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో డోన్‌కు కేంద్రియ విద్యాలయం మంజూరైంది. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు మండల విద్యాధికారి ప్రభాకర్ గురువారం విలేకరులకు తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి 1 నుంచి 5వ తరగతి వరకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. డోన్ ప్రభుత్వ ఐటీఐలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో నేటి నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. సెప్టెంబర్ 11న లాటరీ పద్ధ్దతిలో డ్రా తీసి 12వ తేదీ తుది జాబితా ప్రకటిస్తామన్నారు. 15.09.2025 నుంచి 20.09.2025 వరకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

శ్రీశైలంలో మృత్తికా గణపతికి విశేష పూజలు