‘బీ’ ట్యాక్స్‌కు విద్యుత్‌ అధికారి బలి! | - | Sakshi
Sakshi News home page

‘బీ’ ట్యాక్స్‌కు విద్యుత్‌ అధికారి బలి!

Aug 29 2025 6:36 AM | Updated on Aug 29 2025 6:36 AM

‘బీ’ ట్యాక్స్‌కు విద్యుత్‌ అధికారి బలి!

‘బీ’ ట్యాక్స్‌కు విద్యుత్‌ అధికారి బలి!

ఆళ్లగడ్డ విద్యుత్‌ శాఖ ఏఈ సస్పెన్షన్‌

లాడ్జీలకు కరెంట్‌ ఇవ్వాలని టీడీపీ నేత హుకుం

అందుకు ఒప్పుకోని కొందరు యజమానులు

విద్యుత్‌ కట్‌ చేయించిన వైనం

తప్పు ఒకరిది అయితే.. మరికొరిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు!

ఆళ్లగడ్డ: అహోబిలంలోని ‘బీ’ ట్యాక్స్‌ వ్యవహారం ఒక అధికారిపై వేటు పడేలా చేసింది. టీడీపీ నేత తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌శాఖ అధికారిపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అహోబిలంలోని లాడ్జీల యజమానులతో ఒక్కక్కరితో రూ. 50 లక్షలు ‘బీ’ ట్యాక్స్‌ వసూలు చేయాలని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముఖ్యమైన టీడీపీ నేత నిర్ణయించారు. కొందరు లాడ్జీల యజమానులు ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో వారి లాడ్జీలకు విద్యుత్‌ కట్‌ చేయించారు. దీంతో బాధితులు విద్యుత్‌ శాఖ మంత్రికి, సీఎండీకి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి టీడీపీ నేతను ఏమీ అనకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆళ్లగడ్డ విద్యుత్‌ ఏఈ వెంకట కృష్ణయ్యను సస్పెండ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ టీడీపీ నేత చెప్పారని రూ. లక్షలు విలువ చేసే ఇసుకను రాత్రికి రాత్రి అదే పార్టీకి చెందిన వారికి ఎత్తిచ్చిన కేసులో అప్పటి హౌసింగ్‌ ఏఈని సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే!

ఏం జరిగిందంటే..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేత చెప్పిందే శాసనం అన్న విధంగా అధికారులు జీ హుజూర్‌ అంటూ వస్తున్నారు. అహోబిలంలోని లాడ్జీల యజమానుల్లో ఒక్కొక్కరి నుంచి రూ. 50 లక్షలు ‘బీ’ ట్యాక్స్‌ వసూలు చేయాలని గుంటూరు శీనుకు అప్పగించారు. లాడ్జీల యజమానులు ఎవరూ స్పందించక పోవడంతో అధికారులపై చిందులు తొక్కారు. పంచాయతీరాజ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులను రంగంలోకి దించి నోటీసులు జారీ చేశారు. అయినా స్పందించక పోవడంతో విద్యుత్‌ అధికారులతో లాడ్జీలకు విద్యుత్‌ కట్‌ చేయిస్తూ వేధించడం మొదలు పెట్టారు. దీంతో కొందరు ట్యాక్స్‌ కట్టారు. బీ ట్యాక్స్‌ కట్టిన వారిని వదిలిపెట్టి మిగత లాడ్జీల కరెంట్‌ కట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. విత్యుత్‌ సరఫరా కట్‌ చేయడంతో దిక్కుతోచని కొందరు లాడ్జీల యజమానులు విద్యుత్‌ శాఖ మంత్రికి, సీఎండీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఎండీ నేరుగా జిల్లా అధికారులతో మాట్లాడి ఏఈతో పాటు కట్‌ చేసేందుకు వెళ్లిన ఇతర సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే ఏఈని సస్పెండ్‌ చేసి ఇందులో ఎవరెవరి పాత్ర ఉందని అన్ని శాఖల అధికారులపై శాఖ పరమైన విచారణకు ఆదేశించారు. లాడ్జీలకు అనుమతులు లేవని నోటీసులు ఇచ్చిన పంచాయతీ, ప్రభుత్వ స్థలం ఆక్రమించుకున్నారని రెవెన్యూ అధికారులు, కాలువలు కబ్జా చేశారని ఇరిగేషన్‌ అధికారులు నోటీసులు ఇచ్చారని ఏఈ తెలిపారు. విద్యుత్‌ కట్‌ చేయమంటేనే తాము వెళ్లామని ఇప్పుడు తమపై మాత్రమే చర్యలు తీసుకుంటే ఎలా? అని విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘అన్న చెప్పాడు.. మేడం చెప్పారు’ అని ఆలోచించకుండా సంతకాలు చేసి నోటీసులు ఇచ్చిన అధి కారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

రాష్ట్రస్థాయిలో మాట్లాడుకోవాలి..

సస్పెండ్‌ చేసిన వెంటనే విద్యుత్‌ ఏఈ తోపాటు సిబ్బంది అందరూ ఆళ్లగడ్డ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేత దగ్గరకు వెళ్లి తమ గోడు వెళ్ల బోసుకున్నారు. ‘మీరు చెబితేనే చేశాం కదా మా పరిస్థితి ఏంటి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ముఖ్యనేత జిల్లా విద్యుత్‌ శాఖ అధికారులకు ఫోన్‌ చేయగా.. ‘ఇందులో మేమేమి చేయలేం. ఏదన్నా ఉంటే రాష్ట్రస్థాయిలో మాట్లాడుకోవాలి’ అని తెలిపినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement