
దోపిడీ ముఠా గుట్టు రట్టు!
● ముగ్గురి దొంగల అరెస్ట్
కర్నూలు: కర్నూలు శివారులోని జగన్నాథ గట్టు పైకి వెళ్లే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు రట్టు చేశారు. ముజఫర్ నగర్‌కు చెందిన గోర్లగుట్ట నాగేంద్రుడు, టీవీ9 కాలనీలో నివాసముంటున్న కురువ రమేష్, దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన దూదేకుల మాలిక్ బాషా ముఠాగా ఏర్పడి జగన్నాథగట్టు పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రేమికుల ఫొటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు లేదా విలువైన వస్తువులను తీసుకోవడం, ఇవ్వని వారిని చంపుతామని బెదిరింపులకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం ఒక అమ్మాయి తనకు తెలిసిన అబ్బాయితో ఆటోలో కర్నూలు–బెంగుళూరు జాతీయ రహదారి మీదుగా రాయలసీమ యూనివర్సిటీకి వెళ్తుండగా ముఠా సభ్యులు గుర్తించారు. మార్గమధ్యలో హ్యాంగౌట్ హోటల్ దాటిన తర్వాత ఆటోను ఆపి అందులో ఉన్న అమ్మాయి, అబ్బాయి ఫొటో తీసి ‘మీ తల్లిదండ్రులకు పంపుతాం’ అంటూ కత్తితో బెదిరించారు. అమ్మాయి నుంచి బంగారు గొలుసు, అబ్బాయి నుంచి ఫోన్‌పే ద్వారా రూ.2 వేలు, జేబులో రూ.వెయ్యి లాక్కుని ఉడాయించారు. తిరిగి రెండు రోజుల తర్వాత అమ్మాయికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దోపిడీ ముఠా నుంచి వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితులు స్థానిక కై రా కేఫ్ వద్ద ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10,500 నగదు, బంగారు చైన్, మూడు మొబైల్ ఫోన్లు, ఒక కారు, స్కూటీ, కత్తితో పాటు 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు నాలుగో పట్టణ సీఐ విక్రమసింహా తెలిపారు. పట్టణ శివారులో ప్రేమ జంటలు, సీ్త్ర పురుషులు కాని ఏకాంతంగా గడపటం కోసం వెళ్లి ఇలాంటి వారి బారిన పడి ఇబ్బందులకు గురికావద్దని సూచించారు. ఎవరైనా అలా బెదిరింపులకు పాల్పడితే డయల్ 112 లేదా 9121101062కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఐ తెలిపారు.