‘ఉపాధి’లో వసూళ్లకు స్వాతంత్య్రం! | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో వసూళ్లకు స్వాతంత్య్రం!

Aug 17 2025 4:26 PM | Updated on Aug 17 2025 4:26 PM

‘ఉపాధి’లో వసూళ్లకు స్వాతంత్య్రం!

‘ఉపాధి’లో వసూళ్లకు స్వాతంత్య్రం!

శకటం ఏర్పాటుకు అక్రమ వసూళ్లు ఎవ్వరి దగ్గర వసూలు చేయలేదు

మండలానికి రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశాలు

గతంలో రిపబ్లిక్‌ డే వేడుకల్లోనూ ఇదే తంతు

దళారులుగా వ్యవహరిస్తున్న ఏపీఓలు

హడలెత్తిస్తున్న ఏపీడీలు

బెంబేలెత్తిపోతున్న డ్వామా క్షేత్ర సిబ్బంది

ఆళ్లగడ్డ: జాతీయ పర్వదినాలైన స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్‌ డే వేడుకల నిర్వహణ పేరుతో కొందరు అధికారులు వసూళ్ల పర్వానికి తెరలేపడం విమర్శలకు తావిస్తోంది. మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో ఓ అధికారి ఎవరు ఎంత ఇవ్వాలన్న దానిపై నిర్ణయిస్తున్నారు. అనేక సార్లు క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి నిరసనలు వ్యక్తమైనా వసూళ్ల బాగోతాన్ని వీడలేదు. సందట్లో సడేమియాలా కొందరు మండల స్థాయి ఉద్యోగులు సైతం ఇదే దారిలో పయనిస్తుండటం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమ వసూళ్లు షరా మామూలే అన్న చందంగా తాయరైంది. జిల్లా అధికారి నుంచి మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది (ఫీల్డ్‌ అసిస్టెంట్లు) నుంచి రకరకాలుగా అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా జిల్లా కేంద్రం నంద్యాలలో శుక్రవారం జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉపాధి పథకం తరఫున శకటం ఏర్పాటు చేసేందుకు ఒక్కో మండలం నుంచి రూ. 10 నుంచి రూ. 15 వేలు వసూలు చేయాలని అనధికారకంగా ఉత్తర్వులు ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

రూ.3 లక్షల వసూలు

జిల్లాలో ఏ శాఖ ఏర్పాటు చేయని విధంగా ఉపాధి హామీ పథకం శకటం ఉండాలని అధికారి ఆదేశం. ఇందు కోసం 32 టైర్ల లారీ తీసుకుని దానిపై చెరువు మట్టి నింపి ఫాంపాండ్‌ ఏర్పాటు చేసి దాని చుట్టూ పెద్దపెద్ద చెట్లు పెట్టించాలని ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందో అంతా క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి వసూలు చేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఏపీడీలు, ఏపీఓలు కలిసి చర్చించి పెద్ద మండలం అయితే రూ.15 వేలు, చిన్న మండలం అయితే రూ.10 వేలు తగ్గకుండా వసూలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని 28 మండలాల పరిధిలో కనీసం రూ. 3 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీఓలు, టీసీలు గ్రామాల్లో ఉండే ఫీల్డ్‌ అసిస్టెంట్లతో వసూళ్లు సాగించినట్లు చర్చ జరుగుతోంది.

స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం డబ్బులు వసూలు చేయలేదు. క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి వసూలు చేయమని ఆదేశాలు ఇవ్వలేదు.

– సూర్యనారాయణ, పీడీ, డ్వామా

రిపబ్లిక్‌ డే వేడుకలకు రూ. 2 లక్షలు

ఈ ఏడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్‌ వేడుకలకు సైతం ఇలాగే అందరికంటే ‘ఉపాధి’ శకటమే బాగుండాలని గోకులం (పశువుల షెడ్డు) ఏర్పాటు చేసేందుకు రూ. 2 లక్షలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కో మండలం నుంచి రూ. 8 వేలు వసూలు చేసి ఇచ్చామని ఇలా మాటిమాటికీ వేలకు వేలు ఇవ్వాలంటే ఎలా అని క్షేత్ర, మండల స్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నాయో తెలియని పరిస్థితి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement