
పంటలు వర్షార్పణం
● వరుస వర్షాలతో నీటమునిగిన పంట పొలాలు ● మినుము, మొక్కజొన్న పంటలు కుళ్లిపోతాయని రైతుల ఆందోళన ● ఉరకలేస్తున్న కుందూ నది, మద్దిలేరు వాగు
నీటమునిగిన వరిపైరు
నంద్యాల(అర్బన్): రేయింబవళ్లు కష్టించిన సాగు చేసిన పంటలు వర్షార్పణం అవుతుండటంతో రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడనం కారణంగా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మినుము, మొక్కజొన్న, సోయాచిక్కుడు, మిరప, సాలు వరి, బెండ తదితర పంటలు దెబ్బతింటున్నాయి. కొన్ని చోట్ల మినుము పూత, పిందె దశలో ఉండటంతో పంట నేలకొరిగి కుళ్లిపోయే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల మొక్కజొన్నకు తెగుళ్లు సోకే అవకాశం ఉంది. మిరప, వరి లేత దశలో ఉండటంతో నీట మునిగి కుళ్లు దశకు చేరే పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వీధులు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులు సైతం దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు ప్రశ్నార్థకంగా మారాయి.
ఉద్ధృతంగా కుందూ, మద్దిలేరు
వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కుందూనది, మద్దిలేరువాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు, ప్రజలు అయోమయాలకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పనులకు వెళ్లలేని కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నందికొట్కూరులో అత్యధికంగా..
జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం వరకు వర్షం కురిసింది. నందికొట్కూరు మండలంలో అత్యధికంగా 54మి.మీ. వర్షం కురియగా ప్యాపిలి మండలంలో అత్యల్పంగా 5.4 మి.మీ. నమోదైంది. కొత్తపల్లి 50.8, ఆత్మకూరు 47.8, మిడుతూరు 43.4, బండిఆత్మకూరు 38.0, వెలుగోడు 37.6, జూపాడుబంగ్లా, పగిడ్యాలలో 36.8, పాములపాడు 34.8, గడివేము ల, శ్రీశైలంలలో 31.4, మహానంది 29.4, రుద్రవర ం 27.2, నంద్యాల అర్బన్ 25.0, నంద్యాల రూరల్ 23.6, శిరివెళ్ల 20.2, సంజామల 19.8, చాగలమర్రి 19.2, పాణ్యం, ఉయ్యాలవాడ 18.0, ఆళ్లగడ్డ 17.6, దొర్నిపాడు 16.8, గోస్పాడు 16.2, కోవెలకుంట్ల 15.4, బనగానపల్లె, బేతంచెర్లలో 12.6, డోన్ 10.2, కొలిమిగుండ్లలో 8.6 మి.మీ. వర్షం కురిసింది.

పంటలు వర్షార్పణం

పంటలు వర్షార్పణం