
నేత్ర పర్వం..
స్వర్ణ రథోత్సవం
స్వర్ణరథోత్సవ పూజల్లో పాల్గొన్న దేవస్థాన ఈఓ, అర్చకులు, అధికారులు భక్తజనం మధ్య స్వర్ణరథోత్సవ దృశ్యం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలోమంగళవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు అర్చకస్వాములు జరిపించారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు.
అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం కొనసాగింది. రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి. స్వర్ణ రథోత్సవంలో ఈఓ శ్రీనివాసరెడ్డి, ఏఈవో హరిదాసు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

నేత్ర పర్వం..