
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్‌ఓలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్‌ఎస్ సమావేశానికి వస్తుంటారన్నారు. అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలన్నారు. పలు సమస్యలపై బాధితులు కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
పీజీఆర్‌ఎస్‌లో కొన్ని దరఖాస్తులు
● తనకు ఇల్లు లేదని, ఇంటి స్థలం మంజూరు చేయా లని కొలిమిగుండ్ల మండలం మదనంతపురం గ్రామా నికి చెందిన ఎస్.పెద్దశేఖర్ వినతి పత్రం ఇచ్చారు.
● తన పేరు మీద ఎకరా భూమి ఉండగా రీ సర్వేలో తక్కువగా చూపిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ప్యాపిలి మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పి.మద్దయ్య అర్జీ సమర్పించారు.
● తనకు వస్తున్న వికలాంగుల పింఛన్ తొలగించారని, పునరుద్ధరించాలని గడివేముల గ్రామానికి చెందిన కత్తి శ్రీనివాసులు అర్జీ ఇచ్చారు.
డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్టులు
పీజీఆర్‌ఎస్ హాల్‌లో సోమవారం నంద్యాలకు చెందిన ఎస్‌హెచ్‌జీ మహిళలకు ఎగ్ కార్టులను జిల్లా కలెక్టర్ రాజకుమారి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీఆర్‌డీఏ వెలుగు శాఖల ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యుల అభివృద్ధికి ఎగ్ కార్టులను ఇస్తోందన్నారు. ఇవి జిల్లాకు 100 రాగా.. మార్గదర్శకాల మేరకు అర్హత కలిగిన 40 మందికి ఉచి తంగా ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన 10 ఎగ్ కార్టులు వచ్చాయని చెప్పారు. ఒక్కొక్క ఎగ్ కార్టు రూ.50వేలు విలువ చేస్తుందని తెలిపారు.