శ్రీగిరిలో కనిపించని ‘సౌర’భం | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరిలో కనిపించని ‘సౌర’భం

Aug 19 2025 4:34 AM | Updated on Aug 19 2025 4:34 AM

శ్రీగ

శ్రీగిరిలో కనిపించని ‘సౌర’భం

నివేదిక అందగానే చర్యలు

సోలార్‌ప్లాంట్‌ ఏర్పాటుకు

గత ట్రస్ట్‌బోర్డు ఆమోదం

14 నెలలు గడుస్తున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం

పెరుగుతున్న దేవస్థాన

నెలవారీ విద్యుత్‌ బిల్లులు

ఏటా రూ.8.40 కోట్లు

చెల్లించాల్సిన దుస్థితి

ఆదాయాన్ని కోల్పోతూ..

శ్రీశైలంటెంపుల్‌: సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి, విద్యుత్‌ బిల్లులు తగ్గించుకుని, శ్రీశైలంలో భక్తులకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయవచ్చని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దేవవస్థాన గత ట్రస్ట్‌బోర్డు సైతం ఆమోదం తెలిపింది. అయితే 14 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేదు. దీంతో శ్రీశైల దేవస్థానం ఒక నెల విద్యుత్‌ బిల్లు రూ.70లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అలాగే సంవత్సరానికి రూ.8.40 కోట్లు విద్యుత్‌ ఖర్చు వస్తోంది. విద్యుత్‌ బిల్లు భారం తగ్గిస్తే, ఆ ఆదాయంతో భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు చేయవచ్చని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

విద్యుత్‌ ఖర్చు ఇలా..

శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో వీఐపీ కాటేజీలు, వసతి విభాగాలు, అన్నదాన భవనం, క్యూకాంప్లెక్స్‌, పరిపాలనా భవనం, దేవస్థాన స్టాఫ్‌ క్వాటర్స్‌, దేవస్థాన పరిపాలనా కార్యాలయాల్లో నిరంతరం విద్యుత్‌ వినియోగం ఉంటుంది. ఎల్‌టీ లైన్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా అవుతుంది. అలాగే ఫిల్టర్‌హౌస్‌కు నీటి సరఫరా, ఉభయ దేవాలయాలు, గణేశ సదనం ఇలా పలు వాటికి హెచ్‌టీ లైన్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఎల్‌టీ లైన్‌ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌కు ప్రతి నెలా దేవస్థానం బిల్లుల రూపంలో ఏపీఎస్‌పీడీసీఎల్‌కు రూ.25లక్షల నుంచి రూ.30లక్షలు చెల్లిస్తోంది. అలాగే హెచ్‌టీ లైన్‌ ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌కు సుమారు రూ.30 నుంచి రూ.40లక్షలు బిల్లుల రూపంలో చెలిస్తోంది. హెచ్‌టీ, ఎల్‌టీ విద్యుత్‌ బిల్లుల రూపంలో దేవస్థానం సరాసరి నెలకు రూ.70లక్షలు చెల్లింపులు చేస్తోంది. అంటే ఈ లెక్కన ఒక సంవత్సరానికి రూ.8.40లక్షలు కేవలం విద్యుత్‌ బిల్లులకు మాత్రమే చెల్లిస్తోంది.

రూ.40 కోట్లతో ప్రతిపాదనలు

విద్యుత్‌ బిల్లులకు ఇంత సొమ్ము చెల్లించకుండా, ఆ సొమ్ము భక్తులకు ఉపయోగపడేలా చేయాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైల దేవస్థాన ట్రస్ట్‌బోర్డు సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. సాధారణ రోజుల్లో దేవస్థానం మూడు మెగావాట్లు, మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల్లో నాలుగు మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఈ క్రమంలో 7 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ట్రస్ట్‌బోర్డు భావించింది. అయితే విద్యుత్‌ శాఖ నియమ, నిబంధనల మేరకు 500 కేవీ ప్లాంట్‌కు మాత్రమే అనుమతులిస్తుంది. ఈ క్రమంలో దేవస్థానంలో 500 కేవీ సోలార్‌ ప్లాంట్‌లు రెండు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక మెగావాట్‌ ప్లాంట్‌ కోసం దేవస్థాన డంప్‌యార్డ్‌ సమీపంలో స్థలాన్ని కూడా పరిశీలించారు. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సుమారు రూ.40 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

శ్రీశైల దేవస్థానంలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న నెడ్‌ క్యాప్‌ సంస్థకు లేఖ రాయడంతో సర్వే చేశారు. డంప్‌యార్డ్‌ సమీపంలో సోలార్‌ ప్లాంట్‌ను నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. టెక్నికల్‌ టీం పరిశీలించి నివేదిక సమర్పించాల్సి ఉంది. నివేదిక అందగానే టెండర్‌ పిలిచి ప్లాంట్‌ నిర్మాణానికి చర్యలు చేపడతాం. దేవదాయశాఖ కమిషనర్‌కు సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సానుకూలంగా ఉన్నారు. అలాగే విండ్‌ ఎనర్జీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందా అని సర్వే చేయించాలని కూడా భావిస్తున్నాం.

– ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన

కార్యనిర్వహణాధికారి

శ్రీశైల దేవస్థానం విద్యుత్‌ బిల్లుల రూపంలో ఏటా రూ.8.40కోట్లు నష్టపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14నెలలు గడుస్తున్నా ఇంత వరకు సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టలేదు. తద్వారా దేవస్థానం ఆదాయాన్ని కోల్పోతోంది. కూటమి ప్రభుత్వం స్పందించి సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను నిర్మించి దేవస్థానం ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శ్రీగిరిలో కనిపించని ‘సౌర’భం1
1/1

శ్రీగిరిలో కనిపించని ‘సౌర’భం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement