నల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఆపరేటర్ల విభాగాలు మార్పు చేశారు. 12 మంది ఆపరేటర్లను విభాగాలు మారుస్తూ కమిషనర్ వంశీకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏళ్లుగా ఒకే విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లను విభాగాలు మారుస్తూ ఈ నెల 24న సర్క్యులర్ జారీచేశారు. పరిపాలనలో ఇవన్నీ సాధారణమైనప్పటికీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకోవడంతో మున్సిపల్ కార్పొరేషన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు ఆపరేటర్లు ఒకే విభాగంలో ఏళ్లుగా తిష్ట వేయడం ద్వారా పైరవీలకు తెరలేపారనే ఆరోపణలు వినిపించాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం కూడా వారికి బాగా కలిసొచ్చిందనే చర్చ ఉంది. ఆపరేటర్ల విభాగాలు మార్పు చేయాలని గతంలోనే చర్చ జరిగినా రాజకీయ కారణాలు, నాయకుల ఒత్తిడి కారణంగా అప్పట్లో అమలుకు నోచుకోలేదు. వివిధ విభాగాల్లో ఒకే చోట పనిచేయడం ద్వారా స్థానిక చోటా, మోటా నాయకులతో పరిచయాలు పెంచుకొని పైరవీ ద్వారా వచ్చిన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఆపరేటర్లు తమ పాత స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎలాగైనా పాత విభాగంలోనే ఉండాలని సంబంధిత ఆపరేటర్లు కార్పొరేటర్లను ఆశ్రయించినట్లు తెలిసింది. సంబంధిత కార్పొరేటర్ల ద్వారా స్థానచలనం కలగకుండా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
నల్లగొండ టౌన్ : నల్లగొండలోని పీఆర్‌టీయు భవన్‌లో మంగళవారం తెలంగాణ రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. పెన్షన్ బకాయిలు, వేతన సవరణ సంఘం, ఆరు విడతల కరవు భత్యం తదితర సమస్యలపై సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేయాలని తీర్మానించారు. ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగ సంఘాలు సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న దశలవారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 27న నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు కాటబత్తుల గణేష్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి కొంపెల్లి బిక్షపతి, రాష్ట్ర నాయకులు తీగల శంకరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిగిరి రామకృష్ణారెడ్డి, ఆర్థిక కార్యదర్శి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు మేడి లింగయ్య, సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి ముజాహిద్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కీలక నిర్ణయం తీసుకున్న మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
ఫ స్థానం మారకుండా కార్పొరేటర్లతో ఆపరేటర్ల పైరవీలు!
ఫ రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానం


