నల్లగొండ : నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 32 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలిపారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు.
3న ఉద్యోగులకు ఎంపిక పోటీలు
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లో వచ్చే నెలలో జరుగనున్న సివిల్ సర్వీసెస్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక పోటీలను సెప్టెంబర్ 3న నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించనున్నట్లుజిల్లా యువజన క్రీడల అధికారి అక్బర్ అలీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, క్యారమ్స్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, లాన్ టెన్నీస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, యోగా, ఖోఖో, బెస్ట్ ఫిజిక్ తదితర పోటీలు నిర్వహించి ప్రతిభ కనభర్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతామని తెలిపారు.
‘యువ కనెక్ట్’కు ఎన్జీ కాలేజీ ఎంపిక
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ఎన్జీ కళాశాల విద్యార్థులకు అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రధానితో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు ఈ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంజీ యూనివర్సీటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మారం రమణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ సోమవారం వివరాలను వెల్లడించారు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన యువ కనెక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రధానితో సంభాషించే అవకాశం తమ కళాశాల విద్యార్థులకు లభించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో మేరా భారత్ జిల్లా అధికారి గౌతంరెడ్డి, యువ కనెక్ట్ ఇన్‌చార్జి బొజ్జ అనిల్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు నర్సింగ్ కోటయ్య, ఎం.వెంకట్‌రెడ్డి, కె.శివరాణి, ఆదే మల్లేశం, ఎం.సావిత్రి, సుల్తానా, కొండానాయక్ పాల్గొన్నారు.
రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రామగిరి(నల్లగొండ) : రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం నల్లగొండ రీజియన్ పరిధిలోని 7 డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఆగస్టు 27న 28 అదనపు బస్సుల ద్వారా 44 ట్రిప్పులు, ఆగస్టు 28న 54 అదనపు బస్సుల ద్వారా 115 ట్రిప్పులు నడుపుతానమని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎన్‌సీసీకి ఎంజీయూ విద్యార్థుల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : ఎంజీయులో నూతనంగా చేరిన బీటెక్ విద్యార్థులకు ఎన్‌సీసీలో అవకాశం కల్పించేందుకు 31వ బెటాలియన్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో ఎంపిక పోటీలు నిర్వహించారు. బీటెక్ ఈసీఈ, సీఎస్‌ఈ విభాగాల విద్యార్థులకు మొదటగా దేహదారుడ్య, రాత పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 80 మంది విద్యార్థులు హాజరు కాగా.. 42 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఎన్‌సీసీ అధికారి మచ్చేందర్ తెలిపారు. కార్యక్రమంలో 31వ బెటాలియన్ సుబేదార్ కొమ్ము మల్లయ్య, మలకప్ప, నీరజ్‌కుమార్ పాల్గొన్నారు.


