చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తా | - | Sakshi
Sakshi News home page

చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తా

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

మాట్లాడుతున్న రష్మీఠాకూర్‌, మగ్గంపై చీర నేసే విధానాన్ని పరిశీలిస్తున్న రష్మీఠాకూర్‌

చండూరు : చేనేత రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తానని జాతీయ హ్యాండ్లూమ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మీ ఠాకూర్‌ అన్నారు. సోమవారం ఆమె చండూరు మండల కేంద్రంలో చేనేత చీరల తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మార్కండేయ దేవాలయానికి విచ్చేసిన ఆమెకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె చండూరులోని చేనేత కార్మికులతో సమావేశమై, వారి సమస్యలు, జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పలువురు కార్మికుల ఇళ్లను సందర్శించి, మగ్గం నేసే విధానాన్ని, చీరల తయారీ ప్రక్రియను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రష్మీ ఠాకూర్‌ మాట్లాడుతూ గతంలో తాను అంతర్జాతీయ ర్యాంప్‌ వాక్‌లో ధరించిన ‘ఇక్కత్‌’ గౌను ఎంతో మంది దృష్టిని ఆకర్షించిందని గుర్తుచేశారు. త్వరలోనే బ్రిటీష్‌ పార్లమెంట్‌లో జరగబోయే ఒక ప్రత్యేక సమావేశానికి హాజరవుతున్నానని, ఆ వేదికపై చండూరులో తయారైన ‘తేలియా రుమాల్‌’ విశిష్టతను ప్రపంచానికి చాటిచెబుతానని వెల్లడించారు. హ్యాండ్లూమ్స్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చండూరుకు చెందిన చిలుకూరి శ్రీనివాసులు తయారు చేసిన వస్త్రాలను తిరుమల వేంకటేశ్వరస్వామి వారి అలంకరణకు ఉపయోగించడం చండూరు చేనేత రంగానికి దక్కిన గొప్ప గౌరవమని కొనియాడారు. కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం అంజయ్య, చండూరు మున్సిపల్‌ చైర్మన్‌ కోడి శ్రీనివాసులు, చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు పున్న ధర్మేందర్‌, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య, పులిపాటి ప్రసన్న, ట్రస్ట్‌ చైర్మన్‌ కోమటి వీరేశం, రావిరాల నగేష్‌, గంజి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ జాతీయ హ్యాండ్లూమ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మీ ఠాకూర్‌

ఫ చండూరులో చేనేత గృహాల సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement