తాగునీటి అవసరాలకే..
గుర్రంపోడు : పానగల్ చెరువును నింపి తాగునీటి అవసరాలకు తీర్చేందుకుగాను ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వకు నీటిని బుధవారం విడుదల చేశారు. ప్రస్తుతం పానగల్ ఉదయ సముద్రంలో 0.6 టీఎంసీల నీరు ఉండగా కనీసం ఒక టీఎంసీ నీటిని నిల్వ ఉంచాలనే ఉద్దేశంలో ప్రధానకాల్వకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పానగల్ చెరువు నీటి నిలువ సామర్ధ్యం 1.5 టీఎంసీలు కాగా 15 రోజుల పాటు నీటిని విడుదల చేయడం ద్వారా ఒక టీఎంసీ నీరు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏకేబీఆర్‌లోనూ సరిపడా నీటి నిల్వ ఉన్నందున అంతరాయం లేకుండా నీటి విడుదల చేసే అవకాశం ఉంది.
తూముల వద్ద గట్టి నిఘా..
నీటి విడుదలకు ముందే తూములన్నింటీనీ పరిశీలించి షెట్టర్‌లను అధికారులు తనిఖీ చేశారు. లైనింగ్ పనుల యంత్రాలను కాల్వ నుంచి తొలగించారు. ఇటీవల తూముల నిఘాకు నియమించబడిన సిబ్బందినే తిరిగి భాద్యతలు తీసుకునేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు, రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నీటి చౌర్యం జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు కాల్వకు మోటార్లు వేయడం, తూముల జోలికి వెళ్లడం లాంటి చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నారు.


