నల్లగొండ : నల్లగొండ పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దడమే కాకుండా తెలంగాణలోనే నంబర్ వన్ మున్సిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో రూ.23.85 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, భూమిపూజ చేశారు. 3వ డివిజన్‌లో ఎస్టీ కాలనీ నుంచి శేషమ్మగూడెం మీదుగా అద్దంకి రహదారి వరకు నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పానగల్ సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి డీఈఓ కార్యాలయం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర చేపట్టనున్న వన్‌టైమ్ ఇంప్రూవ్‌మెంట్ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ పట్టణానికి 24 గంటల తాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల 83 కోట్ల రూపాయలతో వాటర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారన్నారు. తాగునీటి అవసరాల కోసం ముఖ్యమంత్రిని ఒప్పించి మరో రూ.300 కోట్లు తీసుకొచ్చినట్లు మంతిర వెల్లడించారు. డిసెంబర్ నాటికి పనులుపూర్తి చేస్తామని చెప్పారు. పట్టణ, పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన 552 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. ఎన్జీ కళాశాలను మోడల్ కళాశాలగా తీర్చిదిద్దేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
మహిళ సంఘాలకు అండగా ఉంటాం..
మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రూ.3 కోట్లతో పెట్రోల్ పంపును ప్రారంభించామని, రూ.2 కోట్లతో సూపర్ మార్కెట్ నిర్మిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా గోదాముల నిర్వహణ, రైస్ మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణంలో రహదారులు, మౌలిక సదుపాయాలు మెరుగుపడటం వల్ల నల్లగొండ మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆమీర్ అలీ, మున్సిపల్ కమిషనర్ వంశీ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పున్నమోహన్, ఈఈ శ్రీధర్‌రెడ్డి, డీఈ గణేష్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ పరశురాం, డీటీడీఓ, ఏసీఎస్ డైరెక్టర్ నాగరత్నం, కార్పొరేటర్లు మల్లీశ్వరి, బొడ్డుపల్లి లక్ష్మి, కవిత, వేణు, స్వాతి, జాతీయ రహదారి అధికారులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ నల్లగొండలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన


