నకిరేకల్ : హైదరాబాద్ – చైన్నె బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రీన్ ఫీల్డ్ అలైన్‌మెంట్‌కు బదులుగా గతంలో ప్రతిపాదించిన ఎన్‌హెచ్–65 రహదారి వెంట కారిడార్ వచ్చేలా పరిశీలించాలని కోరారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ ద్వారా ఇప్పటికే అభివృద్ధి చెందిన పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, అధిక జనాభా ఉన్న ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి దృష్టికి తెచ్చారు. 65వ నంబర్ జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేస్తే నకిరేకల్‌తో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అధిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వినతిపత్రం అందించిన వారిలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.
ఫ కేంద్ర రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి


