సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు | - | Sakshi
Sakshi News home page

సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు

Aug 9 2026 2:16 AM | Updated on Aug 9 2026 2:16 AM

ఆగస్టు 2028 నాటికి

ఎస్‌ఎల్‌బీసీ పూర్తి..

నల్లగొండ : ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టుల నుంచి నీరు ఇచ్చే పరిస్థితి లేదని.. రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేదని చెప్పారు. శనివారం నల్లగొండ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో నీరు డెడ్‌స్టోరేజ్‌లో ఉందని.. శ్రీశైలం నుంచి నీరు వచ్చినప్పటికీ సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రాబోయే రోజుల్లో సూపర్‌ ఎల్‌నినో కారణంగా దక్షిణ తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియడం లేదని.. అందువల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అండగా ఉండాలన్నారు.

1.50 లక్షల ఎకరాల్లో ఆరుతడి వేయాలి

జిల్లాలో పంట మార్పిడిలో భాగంగా ఇప్పటికే 33 వేల ఎకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలు వేశారని తెలిపారు. దీన్ని లక్షన్నర ఎకరాల లక్ష్యంగా తీసుకుని రైతులతో ఆరుతడి పంటలు వేయించాలని అధికారులను ఆదేశించారు. రెండు పంటలు వరి వేస్తే భూములు సారం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు. కూరగాయలు, ఉద్యాన పంటలు పండించాలని, ఆర్గానిక్‌ వ్యవసాయం చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాకు 5 వేల యూనిట్ల స్ప్రింక్లర్లు కావాలని అధికారులు కోరగా, తక్షణమే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

15లోగా ఆరుతడి పంటలు వేయాలి : కలెక్టర్‌

కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఈ నెల 15 వరకు మాత్రమే ఆరుతడి పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులను చైతన్యం చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో రూఫ్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ బుర్రి చైతన్య, మార్కెట్‌ చైర్మన్లు శేఖర్‌రెడ్డి, జూకూరి రమేష్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ ప్రేమ్‌కరణ్‌ రెడ్డి, జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ఆమీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లాకు శాశ్వతంగా సాగునీరు అందించే ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను ఆగస్టు 2028 నాటికి పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏఎంఆర్‌పీ, ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ద్వారా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. శ్రీశైలం డెడ్‌స్టోరేజ్‌లో ఉన్నప్పటికీ ఎస్‌ఎల్‌బీసీ నుంచి సాగునీరు అందించవచ్చని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 9 వేల ట్రాన్స్‌ఫార్మర్లపై ఉన్న ఓవర్‌లోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైన విద్యుత్‌ సామగ్రిని తెప్పిస్తామన్నారు.

ఫ సాగర్‌లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకే..

ఫ కష్టకాలంలో రైతులకు అధికారులు అండాగా ఉండాలి

ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement