పెద్దవూర : ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పెద్దవూర ‘పెద్దవాగు’ పూర్తిగా ఎండిపోయింది. నాంపల్లి మండలం పసునూరు చెరువు వద్ద పుట్టే ఈ వాగు.. గుర్రంపోడ్, పీఏపల్లి మండలాల మీదుగా పెద్దవూర మండలంలోకి ప్రవహిస్తుంది. ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నిర్మాణంతో ఈ వాగు నిత్యం నీటితో కళకళలాడుతూ ఉండేది. దీంతో రైతులు కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. పానగల్లు చెరువు తాగునీటి అవసరాల కోసం పదిహేను రోజులుగా ఏఎమ్మార్పీ కాలువకు నీటిని విడుదల చేయడంతో ఈ వాగులో కొద్దిపాటి జలాలు ప్రవహించాయి. ఆ నీటిని చూసి కొందరు రైతులు మోటార్లతో వరినాట్లు వేయగా, మరికొందరు నాట్లకు సిద్ధమయ్యారు. కానీ, ప్రస్తుతం వాగు పూర్తిగా ఎండిపోయి మోటార్లు బయటకు తేలడంతో నాట్లు వేసిన పంటలు సైతం ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బట్టుగూడెం వంతెన వద్ద వాగు ఎండిపోవడంతో తేలిన మోటార్లు


