
గిరిజనులకు వైద్యం అందించాలి
నాగార్జునసాగర్ : అమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని చెంచుగూడేలు, తండాల్లోని గిరిజనులకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పలు స్వచ్ఛంద సంస్థలు, అధికారులతో ఏప్రాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరక్షరాస్యత, అవగాహన లోపం, మేనరిక వివాహాలు, పౌష్టికాహారలోపం, యుక్తవయస్సుకు ముందే గర్భం దాల్చడం, వివిధ జబ్బులకు సకాలంలో చికిత్స తీసుకోకపోవడం, రక్తహీన తదితర కారణాలతో గిరిజనులు బాధపడుతున్నారని తెలిపారు. గిరిజనుల ఆరోగ్యానికి సంబంధించిన లోపాలను గుర్తించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘నైస్’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రాఖీ నాగర్‌కర్నూల్ జిల్లా అప్పాపూర్, రాంపూర్, చెంచుపేటలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని గిరిజనుల ఆరోగ్యం కోసం పనిచేసిన అనుభవాలను వివరించారు.
చందంపేటను పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలి
చందంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అక్కడి సమస్యలను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు దేవరకొండ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవిని నోడల్ అధికారిగా, డీటీడీఓ చత్రునాయక్, గృహనిర్మాణ శాఖ పీడీ రాజకుమార్‌ను సమన్వయ సమస్యల పరిష్కారానికి అధికారులుగా నియమిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రిని సందర్శించి.. రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను డాక్టర్ మాతృనాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవి, డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చత్రునాయక్, రిచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రష్మీ, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి