
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌తో కలసి మూసీ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో, నీటిమట్టం, కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో వివరాలు, ప్రాజెక్టు వద్ద నెలకొన్న సమస్యలు నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గేట్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ క్రస్ట్‌గేట్లు ఎత్తాలని సూచించారు. అనంతరం వారు మూసీ ప్రాజెక్టు దిగువన కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామం వద్ద మూసీ నదిపై నిర్మించిన లోలెవల్ కాజ్‌వేను పరిశీలించారు. మూసీ ప్రాజెక్టు నుంచి 20వేల క్యూసెక్కులకు పైగా వరదనీటిని వదిలినప్పుడు మాత్రమే లోలెవల్ కాజ్‌వే వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు కలెక్టర్‌కు చెప్పారు. కలెక్టర్ వెంట నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, సూర్యాపేట డివిజన్ ఐబీ ఈఈ ఎన్.వెంకటరమణ, మూసీ డీఈలు చంద్రశేఖర్‌రెడ్డి, వాణి, జేఈ కీర్తి, ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, తహసీల్దార్ రమాదేవి, ఆర్‌ఐ వెంకన్న తదితరులు ఉన్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగొద్దు
నల్లగొండ : రానున్న 72 గంటల్లో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో హైదరాబాద్ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ్ అమిత్, దేవరకొండ ఏసీపీ మౌనిక తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఎస్పీతో కలిసి మూసీ ప్రాజెక్టు సందర్శన