
కారొ్పరేషన్ పదవుల పందేరం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కార్పొరేషన్ డైరెక్టర్ల నియామకానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కార్పొరేషన్ డైరెక్టర్లను త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఆశావహుల్లో ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే జిల్లాలో మంత్రులు సిద్ధం చేసిన జాబితాలను రాష్ట్ర పార్టీకి పంపించారు. అందులో కొందరికి త్వరలోనే డైరెక్టర్ పదవులు దక్కనున్నాయి.
ప్రతి నియోజకవర్గంలో
ఇద్దరు ముగ్గురికి అవకాశం
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు వందవరకు ఉండగా, ఒక్కో దాంట్లో నాలుగైదు డైరెక్టర్ పదవులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు జాబితాలు ఇవ్వాలని గతంలోనే మంత్రులకు రాష్ట్ర పార్టీ సూచించింది. అందుకు అనుగుణంగా ఆయా పదవుల కోసం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి పది మంది చొప్పున పేర్లను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. అందులో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి డైరెక్టర్లుగా అవకాశం లభించనుంది.
స్థానిక ఎన్నికలకు ముందే భర్తీ..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయింది. పార్టీలో పనిచేసే వారికే పదవులు అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కూడా పలు సందర్భాల్లో ప్రకటించారు. అందులో భాగంగా ప్రస్తుతం కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే ఆలోచనల్లో ప్రభుత్వం ఉంది. అంతకంటే ముందుగానే కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడర్ బాగా పని చేస్తుందనే అంచనాల్లో ఉంది. కార్యకర్తలు కూడా కష్టపడి పని చేస్తారనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. అందుకే ముందుగా డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది.
చైర్మన్ పదవులు ఎప్పుడు...?
ప్రస్తుతం కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల పదవులను ఎప్పుడు భర్తీ చేస్తారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఆశావహులు కార్పొరేషన్ల చైర్మన్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా డైరెక్టర్ పదవులను భర్తీ చేస్తామని చెప్పడంతో చైర్మన్ పదవులను ఎప్పుడు భర్తీ చేస్తామన్నది ప్రకటించకపోవడంతో సందిగ్దత నెలకొంది.
ఫ రాష్ట్ర పార్టీకి జాబితాలను పంపించిన జిల్లా మంత్రులు
ఫ నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురికి దక్కనున్న డైరెక్టర్ పదవులు
ఫ వీరి నియామకం తర్వాతే స్థానిక ఎన్నికలు
ఫ చైర్మన్ పదవులపై వీడని సందిగ్దం