
జిల్లా మంత్రులు దద్దమ్మలు
నల్లగొండ టూటౌన్ : వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించే సోయిలేని జిల్లా మంత్రులు దద్దమ్మలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నల్లగొండలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఇద్దరు మంత్రులకు ఏపీకి నీరు వదిలేంత ఆతృత జిల్లాలో రైతులకు ఇవ్వడంలో లేదన్నారు. కేసీఆర్ హయాంలో ఏఎమ్మార్పీ కింద కనగల్, నల్లగొండ, తిప్పర్తి, నకిరేకల్, సాగర్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిచామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 70 వేల ఎకరాలకు నీరందించిన ఘనత మా ప్రభుత్వానిదన్నారు. సాగునీటి కోసం రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా మంత్రి కోమటిరెడ్డికి పట్టింపు లేదని మండిపడ్డారు. కృష్ణానది జలకళ సంతరించుకున్నా.. జిల్లాలోని చెరువులు ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయని, గత సంవత్సరం కూడా పంటలు ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. మోటార్లు మరమ్మతుకు గురైతే సమీక్షించే బాధ్యత జిల్లా మంత్రి కోమటిరెడ్డికి లేదా అని ప్రశ్నించారు. నల్లగొండ నడిబొడ్డున ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని మంత్రి సొంత క్యాంపు కార్యాలయంగా మార్చుకోవడం సరికాదన్నారు. నిజాం కాలం నాటి అతిథి గృహాన్ని మార్చడం మంచి పద్ధతి కాదన్నారు. దానికి నిధులు మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వమని గుర్తు చేశారు. అంతకు ముందు పానగల్ ఉదయసముద్రాన్ని నాయకులతో పరిశీలించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, నిరంజన్ వలి, సింగం రామ్మోహన్, చీర పంకజ్‌యాదవ్, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, బోనగిరి దేవేందర్, రవీందర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఐతగాని యాదయ్య, దేప వెంకట్‌రెడ్డి, వంగాల సహదేవరెడ్డి, తండు సైదులుగౌడ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.
ఫ వందల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా.. ఏఎమ్మార్పీ పరిధిలో నీరిచ్చే సోయి లేదు
ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి