
సమ్మెలోకి కేటరింగ్ కాంట్రాక్టర్లు
నల్లగొండ : ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఓ 17కు వ్యతిరేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు, కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో భోజనం అందించే కేటరింగ్ కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ ఈ నెల 14వ తేదీనుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఇప్పటికే వారు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. వారితోపాటు కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్ సరఫరా చేసే కాంట్రాక్టర్లు కూడా సమ్మె బాట పడుతున్నారు. నేటి నుంచి గురుకులాల్లో వంట సేవలు ఆగిపోనున్నాయి. దీంతో విద్యార్థులు ఎవరు వంట చేస్తారనే దానిపై సందిగ్దం నెలకొంది.
బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా జీఓ 17
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం కేటరింగ్ కాంట్రాక్టర్ల ఎంపిక విషయంలో జీఓ నంబర్ 17 తెచ్చింది. ఈ జీవో ప్రకారం ఒక కాంట్రాక్టర్, ఒక స్కూల్‌కు సంవత్సర కాలంలో రూ.20 లక్షలు సరుకులు సరఫరా చేస్తే రూ.4 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జీవో వల్ల చిన్న కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనే పరిస్థితి లేదని.. బడా కాంట్రాక్టర్లకు అనుకూలంగా కొత్త జీఓ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే నాలుగు నెలలుగా ఎలాంటి బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే.. ప్రస్తుతం కొత్త టెండర్ విధానం తేవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్‌లో పాల్గొనే ఆర్థిక స్థోమత లేదని సడలింపులు ఇవ్వాలని ఇప్పటికే పలువురు చిన్న కాంట్రాక్టర్లు కలెక్టర్‌కు విన్నవించారు. పాత టెండర్ విధానం కొనసాగించాలని కోరారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు.
వంట ఎలా..!
గురుకుల, కేజీబీవీల్లో వంటలను మహిళా సంఘాలకు అప్పగిస్తారని చర్చ సాగుతోంది. నెలకు సరిపడా కిరాణ సామాను ఇప్పటికే హాస్టళ్లకు చేరింది. కూరగాయలు 2, 3 రోజులకోసారి సరఫరా చేస్తారు. మటన్, చికెన్ వారంలో 2 పర్యాయాలు అందిస్తారు. కాంట్రాక్టర్లు సమ్మెలోకి వెళ్తే వీటి సరఫరా ఆగిపోయే అవకాశం ఉంది. వంట సిబ్బంది సమ్మె బాట పడితే పిల్లలకు భోజనానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
నేటి నుంచి గురుకులాలు,
కేజీబీవీల్లో వంటలు బంద్
జీఓ 17కు నిరసనగా ఆందోళన బాట