
పత్తికి అదునైన వాన..!
నల్లగొండ అగ్రికల్చర్ : ఈ వానాకాలం సీజన్‌లో మెట్టపంటలకు అనుకూలంగా మంచి ఆదునైన వర్షాలు కురుస్తున్నాయి. జాన్‌లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పటికి జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలే కురిసాయి. ఈ వర్షాలు పత్తి పంటకు అనుకూలంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా 5,57,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మంచి అనుకూలమైన వర్షాలు కురవడంతో పత్తి చేలలో గుంటకలు తోలుకుని కలుపు తీసుకున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎరువులు పెట్టుకోవడంతో చేలు మంచి ఏపుగా పెరిగి పూత, పిందె దశలో కనిపిస్తున్నాయి.వారం రోజుల్లో కాయదశకు చేరుకుంటాయి. దసరా పండుగ నాటికి పత్తి తెంపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చేలు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఈ సీజన్‌లో పత్తి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అధిక వర్షపాతం నమోదు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అధిక వర్షపాతం నమోదైంది. మిర్యాలగూడం మండలంలో మాత్రం లోటు వర్షం కురిసింది. ఇప్పటి వరకు సగటున జిల్లాలో 246.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 309.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మర్రిగూడ, పీఏపల్లి, కొండమల్లేపల్లి, గుండ్లపల్లి, చందంపేట మండలాల్లో అత్యధిక వర్షం కురవగా చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, శాలిగౌరారం, నకిరేకల్, చింతపల్లి, గుర్రంపోడు, అడవిదేవులపల్లి, టి.సాగర్, పెద్దవూరలో అధిక వర్షం కురిసింది. మిగతా మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.
ఫ జిల్లాలో 5,57,641 ఎకరాల్లో సాగు
ఫ పూత, పిందె దశలో పత్తి చేలు
ఫ మంచి దిగుబడి వస్తుందని రైతుల ఆశాభావం