కోదాడ రూరల్ : సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో పశు ఔషధ బ్యాంకు ఏర్పాటైంది. ఇక్కడ పని చేస్తున్న పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య రైతులకు మేలు చేయాలనే వినూత్న ఆలోచనతో దాతల సహకారంతో పశు ఔషధ బ్యాంకు ఏర్పాటుకు నాంది పలికారు. గేదెలు, జీవాలను ఆరుబయట మేతను మేపేందుకు గతంలో మాదిరిగా బీడు భూములు, ఖాళీ స్థలాలు లేకపోవడంతో వాటికి కావాలిసిన పోషకాలతో కూడిన మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో గేదెలు, జీవాలు ఈనిన తర్వాత ఎదకు రావాల్సిన సమయానికి రావడం లేదు. గేదె నెలరోజులు ఆలస్యంగా కడితే రైతు దాదాపుగా రూ.10వేలను నష్టపోతున్నాడు. రైతులు ఆ విధంగా నష్టపోవద్దని గేదెలు సకాలంలో సూడికట్టాలంటే వాటికి మినరల్ మిక్చర్, కాల్షియం వంటి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. పేద రైతులకు వాటిని కొనుగోలు చేసేంత స్థోమత ఉంటలేదు. దీంతో డాక్టర్ పెంటయ్య పశు ఔషధ బ్యాంకు ఏర్పాటు చేశారు. ఆ ఔషధ బ్యాంకు ద్వారా పాడి రైతులకు పలు రకాల న్యూట్రిషిన్ మందులతో పాటు వ్యాధుల నివారణ మందులను కూడా ఇస్తున్నారు. ఇందులో కొన్ని మందులు ఉచితంగా, మరికొన్ని అతి తక్కువ ధరలకే అందజేస్తున్నారు.
దాతల సహకారంతో...
పాడి రైతులకు ఎక్కువగా ఉపయోగపడే మినరల్ మిక్చర్(ఖనిజ లవణ మిశ్రమం), కాల్షియం టానిక్‌లు అందజేసేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. అమెరికాలో పశువైద్యాధికారిగా పనిచేస్తున్న వెంకటరమణారెడ్డి రూ.50వేలు విరాళం ఇవ్వగా ఆ నగదు రివాల్వింగ్ ఫండ్ కింద జమ చేశారు. దానితో పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్శిటీ నుంచి 2 టన్నుల మినరల్ మిక్చర్‌ను కొనుగోలు చేశారు. బయట మార్కెట్‌లో కెజీ రూ.250 అమ్ముతుండగా వైద్యశాలకు గేదెలను తీసుకొచ్చిన పాడి రైతులకు కెజీని కేవలం రూ.50కే విక్రయిస్తున్నారు.
రాష్ట్రంలో మొదటిసారిగా ఏర్పాటు
పాడి పశువులకు ఉచితంగా, తక్కువ ధరకే మందుల పంపిణీ
డాక్టర్ పెంటయ్య చొరవతో ముందుకొస్తున్న దాతలు
ఇప్పటి వరకు 600 మంది
రైతులకు పశువుల
మందులు పంపిణీ
పాడి రైతులకు మేలు చేసేందుకు పశు ఔషధ బ్యాంకు
పాడిపశువుల, జీవాల పెంపకందారులకు అతి తక్కువ ధరలకే మందులను అందజేసేందుకు దాతల సహకారంతో గత ఏడాది అక్టోబర్‌లో పశుఔషధ బ్యాంకు ఏర్పాటు చేశాం. గేదెలకు ఎంతో ఉపయోగపడే మినరల్ మిక్చర్‌ను తక్కువ ధరకే అందజేస్తున్నాం. న్యూట్రిషన్ మందులతో పాటు రోగనిరోధక మందులను కూడా ఉచితంగా అందజేస్తున్నాం. ఇప్పటి వరకు 600 మంది రైతులకు పలు రకాల మందులను అందజేశాం.
– డాక్టర్ పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్, కోదాడ ప్రాంతీయ పశువైద్యాశాల వైద్యాధికారి
ఇక కోదాడ మండలంలోని కాపుగల్లుకు చెందిన మరో దాత ముత్తవరపు పూర్ణచందర్‌రావు 500లీటర్ల కాల్షియం టానిక్‌ను విరాళంగా ఇవ్వగా లీటరు రూ.1000 ఉండే టానిక్‌ను ఉచితంగా ఇస్తున్నారు. అదే విధంగా లీటరు రూ.1000 ఉండే లివర్ టానిక్ కూడా రైతులకు ఉచితంగా ఇస్తున్నామని డాక్టర్ పెంటయ్య తెలిపారు. వీటితో మరికొందరు దాతలు రూ.5 వేల నుంచి రూ.20వేలకు వరకు నగదు రూపంలో విరాళం ఇచ్చారు. వాటితో గేదెలు, జీవాలు, కోళ్లకు కావాల్సిన పలు రకాల నట్టలమందు, ఐరన్‌టానిక్, పేల మందు, టానిక్ పౌడర్, యాంటి బయాటిక్, జీర్ణ సంబంధిత వంటి వ్యాధులకు సంబంధించిన మందులను స్టాక్ ఉన్నంత మేరకు ఉచితంగా అందజేస్తున్నారు. దాతలు మరింత మంది ముందుకొస్తే వారు అందజేసే నగదును రివాల్వింగ్ ఫండ్ కింద ఏర్పాటు చేసి మరింత మంది రైతులకు ఉచితంగా అందజేయడానికి వీలుంటుందని డాక్టర్ పెంటయ్య అంటున్నారు.
కోదాడలో పశు ఔషధ బ్యాంకు
కోదాడలో పశు ఔషధ బ్యాంకు