సహకార సేవలు విస్తృతం
ప్రతిపాదనలు ఇలా..
ఉమ్మడి జిల్లాకు కొత్తగా 22 పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
నల్లగొండ అగ్రికల్చర్ : సహకార సంఘాల సేవల విస్తరణకు సహకార శాఖ పూనుకుంది. కొత్త సహకార సంఘాలను (పీఏసీఎస్)ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన మండలాలతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు ఉన్న సంఘాల నుంచి కొన్ని గ్రామాలను వేరు చేసి.. కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22 కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటకు సహకార శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం ఆమోదిస్తే కొత్త సంఘాలు ఏర్పాటై రైతులకు సేవలు విస్తృతం కానున్నాయి.
రైతులకు సేవలు విస్తరించేలా..
2013 తరువాత కొత్త సంఘాలు ఏర్పాటు కాలేదు. రెండు గ్రామాలకు ఒక సంఘం ఉండగా.. మరికొన్ని సంఘాల్లో మూడు నాలుగు గ్రామాలు ఉన్నాయి. ఇక, కొన్ని సంఘాల్లో 500 మంది రైతులు సభ్యులుగా ఉంటే మరికొన్ని చోట్ల.. మూడు నాలుగు వేల మంది సభ్యులు ఉన్నారు. దీంతో రుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర సేవలను అందిండంలో ఆయా సంఘాలు రైతులకు సరైన న్యాయం చేయడం లేదని విమర్శలు ఉన్నాయి. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంఘాల సేవలను విస్తరించడం కోసం రెండు సంవత్సరాలుగా కొత్త సంఘాల ఏర్పాటు కోసం రైతులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.
132కు చేరనున్న సంఘాలు
కొత్త సంఘాల కోసం ప్రతిసాదనలు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం కోరింది. దీంతో కొత్త సంఘాల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలో సంఘాల ఏర్పాటు కోసం అవసరమైన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేయనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 110 సహకార సంఘాలు ఉన్నాయి. కొత్తగా 22 సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే మొత్తం సంఘాల సంఖ్య 132కే చేనుంది.
ప్రస్తుతం పీఏసీఎస్ ఇలా
జిల్లా పీఏసీఎస్‌లు
నల్లగొండ 42
సూర్యాపేట 47
యాదాద్రి 21
మొత్తం 110
నల్లగొండ జిల్లాలో మాడుగులపల్లి, గట్టుప్పల్, గుడిపల్లి, తిరుమలగిరి సాగర్, అడవిదేవులపల్లి.
సూర్యాపేట జిల్లాలో వెలిదండ, దిర్శించర్ల, త్రిపురవరం, రామాపురం, గుడిబండ, తొగర్రాయ్, గనపవరం .
యాదాద్రి భువనగిరి జిల్లాలో కంచనపల్లి, ఎస్.లింగోటం, యల్లంకి, మునిపంపుల, మోటకొండూరు, కూరెళ్ల, వర్కట్‌పల్లి, జబ్లక్‌పల్లి, బట్టుగూడెం.
ఫ ప్రభుత్వం ఆమోదిస్తే 132కు చేరనున్న సంఘాల సంఖ్య
ఫ తీరనున్న రైతుల ఇబ్బందులు


